ఐదు సార్లు విజేత.. పదిసార్లు ఫైనలిస్టులు.. ఆడిన 16 సీజన్లలో ఏకంగా 12 సార్లు ప్లేఆఫ్స్.. ఐపీఎల్లో తన పేరే ఓ బ్రాండ్‌గా మార్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఘనతకు మచ్చుతునకలివి! కానీ ఇదంతా గతం.. గత రెండు సీజన్లుగా ఆ జట్టు ఆటతీరు నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. ఐపీఎల్-18లో అయితే ధోనీసేన మిగిలిన జట్ల కంటే ముందుగానే నిష్క్రమించి ఆ జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఐపీఎల్ ఆరంభమైనప్పట్నుంచి బ్యాక్ టు బ్యాక్ సీజన్ల (నిరుడు 5వ స్థానం)లో చెన్నై ప్లేఆఫ్స్ చేరకపోవడం ఇదే తొలిసారి. మరి లీగ్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టు అయిన చెన్నై అంచనాలు ఎక్కడ తప్పాయి?
-నమస్తే తెలంగాణ క్రీడా విభాగం
CSK | వరుస పరాభవాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఈ సీజన్ తీవ్ర నిరాశను మిగిల్చింది. బుధవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓడటంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు అధికారికంగా నిష్క్రమించింది. ఒకప్పుడు కంచుకోట అయిన చెపాక్‌లో పంజాబ్‌తో ఓటమి ఆ జట్టుకు ఈ సీజన్లో సొంతగడ్డపై వరుసగా ఐదో ఓటమి. ఐపీఎల్-18లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో విఫలమైన సీఎస్కే.. చెపాక్‌లో ఘోర అవమానాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. 43 ఏండ్ల వయసులోనూ ధోనీపై ఎక్కువగా ఆధారపడటం.. ఈ ఫార్మాట్‌కు సరిపడకున్నా సీనియర్లనే నమ్ముకోవడం.. బ్యాటింగ్ బలహీనత.. పేలవ ఫీల్డింగ్.. ఆక్షన్ తప్పిదాలు.. కీలక ఆటగాళ్ల గాయాలు.. వెరసి ఈ సీజన్లో చెన్నైకి ఏదీ కలిసి రాలేదు.
తాజా సీజన్లో చెన్నై వైఫల్యాలకు ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమే అనేది సుస్పష్టం. ఆరంభం నుంచీ ఆ జట్టుకు సరైన ఓపెనింగ్ జోడీ కుదరనేలేదు. ఆరంభ మ్యాచ్‌లలో రచిన్, రుతురాజ్, కాన్వే, త్రిపాఠి.. ఇలా పలువురిని ప్రయోగించి విఫలమైన ఆ జట్టు.. గత నాలుగు మ్యాచ్‌ల్లో షేక్ రషీద్, అయుశ్ మాత్రెతో ప్రయోగం చేసినా ఫలితం మారలేదు. గత కొన్ని సీజన్లుగా ఆ జట్టు అత్యధిక పరుగుల వీరుడైన రుతురాజ్.. ఈసారి సారథిగా పలు మ్యాచ్‌లలో రాణించినా గాయంతో అతడు వెనుదిరగడం చెన్నైకి కోలుకోలేని దెబ్బ. మిగిలిన జట్లన్నీ పవర్ ప్లేలోనే వీరబాదుడు బాది ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తుంటే.. చెన్నై ఈ సీజన్లో ఆడిన పది మ్యాచ్‌లకు గాను ఆరుసార్లు కనీసం 50 రన్స్ కూడా చేయలేక చతికిలపడింది. 18వ సీజన్లో ఇప్పటిదాకా ఆ జట్టుదే అత్యల్ప రన్‌రేట్ (8.23). న్యూజిలాండ్ తరఫున సంచలన ప్రదర్శనలతో దుమ్మురేపే రచిన్‌తో పాటు కాన్వే ఈ సీజన్లో దారుణంగా విఫలమవడంతో సీఎస్కే యాజమాన్యం వారిని బెంచ్‌కే పరిమితం చేసింది.
త్రిపాఠి ఆరు మ్యాచ్‌లు ఆడితే చేసినవి 55 పరుగులు. మిడిలార్డర్లో జడేజా (165)తో పాటు మ్యాచ్‌కు ఓ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న ధోనీ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీపక్ హుడా, విజయ్ శంకర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సీఎస్కే భారీ ఆశలు పెట్టుకున్న శివమ్ దూబె కూడా పది ఇన్నింగ్స్‌ల్లో చేసింది 248 పరుగులే. స్పిన్నర్లను బాగా ఆడగలడనే పేరున్న అతడు తాజా సీజన్లో మాత్రం మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. ఇప్పటి దాకా పది మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. 200 మార్కు దాటింది ఒకే ఒక్కసారి. ప్రత్యర్థులు తమ ఎదుట 180+ టార్గెట్ నిర్దేశిస్తే చెన్నై ఓటమి అధికారికంగా ఖరారే అన్నంత ఘోరంగా ఆ జట్టు బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగుతున్నది. చెన్నై ఫీల్డింగ్ గురించి మాట్లాడుకోకపోవడమే ఉత్తమం. ఈ సీజన్లో సీఎస్కే ఫీల్డర్లు వదిలేసిన క్యాచ్‌లు 20కు పైనే.. స్వయంగా ధోనీనే ‘మా ఫీల్డింగ్ మారాలి. మేం కొన్ని క్యాచ్‌లను మిస్ చేయకుంటే బాగుండేది’ అన్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిఖార్సైన పేస్ ఆల్‌రౌండర్ లేకపోవడమూ చెన్నైని దెబ్బతీసింది.
సీఎస్కే అంటే ధోనీ.. ధోనీ అంటే సీఎస్కే అన్నంతగా అభిమానాన్ని సంపాదించుకున్న ‘తలా’పై చెన్నై బాగా ఆధారపడటమూ ఆ జట్టు వైఫల్యాలకు ఓ కారణమని చెప్పకతప్పదు. 43 ఏండ్ల వయసులో ధోనీ బ్యాటింగ్‌లో నాటి దూకుడు లేదు. అడపాదడపా షాట్లు ఆడుతున్నా అవీ జట్టుకు విజయాలు అందించేవైతే కావు. సీజన్ మధ్యలో రుతురాజ్ గాయపడగానే మరో ప్లేయర్ కోసం చూడకుండా సీఎస్కే యాజమాన్యం.. ధోనీకే ఆ బాధ్యతలను అప్పగించడం చూస్తే ఇన్నేండ్లలో ఆ జట్టు ధోనీ వారసుడిని తయారు చేసుకోలేకపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అశ్విన్, జడేజా భారత క్రికెట్ దిగ్గజాలనడంలో సందేహమే లేదు. కానీ ఈ ఇద్దరూ జాతీయ టీ20 జట్టుకు వీడ్కోలు పలికారు. వయసు రీత్యా కుర్రాళ్లలో ఉండే దూకుడు ఈ ఇద్దరిలో లేదన్నది కండ్లెదుట కనబడుతున్న వాస్తవం. ‘డాడీస్ ఆర్మీ’గా ముద్రపడ్డ చెన్నై.. వేలంలోనూ ఇలాంటి వయసు మళ్లిన ఆటగాళ్లను తీసుకుని పప్పులో కాలేసింది. జడ్డూను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకున్న చెన్నై.. వేలంలో అశ్విన్‌ను రూ. 9.75 కోట్లకు దక్కించుకుంది. కాన్వేకు రూ. 6.25 కోట్లు వెచ్చించిన ఆ జట్టు.. శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ వంటి యువ ఆటగాళ్లు వేలంలో ఉన్నా వారివంక కన్నెత్తి కూడా చూడలేదు. స్వయంగా చెన్నై హెడ్‌కోచ్ ఫ్లెమింగ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘వేలంలో మేం ఇతర జట్లతో పోలిస్తే కొన్ని విషయాల్లో విఫలమయ్యాం’ అని చెప్పాడు.
స్పిన్‌కు అనుకూలించే చెపాక్‌లో ప్రత్యర్థులపై చెన్నై ఆధిపత్యం మరో స్థాయిలో ఉండేది. ఇక్కడ ధోనీసేనను ఓడించాలంటే పర్యాటక జట్లకు శక్తికి మించిన పనే అయ్యేది. ఈ సీజన్‌కు ముందు చెపాక్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2008 నుంచి ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 15 ఏండ్లుగా ఢిల్లీకి పరాభవాలు తప్పలేదు. హైదరాబాద్ అయితే అసలు ఇక్కడ గెలుపు రుచినే చూడలేదు. కానీ ఈ సీజన్లో ఈ మూడు జట్లు చరిత్రను తిరగరాశాయి. అదీగాక చెపాక్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడటం సీఎస్కే చరిత్రలో ఇదే మొదటిసారి. ఏదేమైనా చెన్నైకి ఈ సీజన్ ఓ మేలుకొలుపు. సీనియర్లను, సంప్రదాయ పాత పద్ధతులను వదిలేసి కొత్త నాయకత్వం, యువ క్రికెటర్ల వైపు దృష్టి సారించడానికి ఆ జట్టుకు సువర్ణావకాశం. వచ్చే సీజన్ నాటికి చెన్నై ఎలా కమ్‌బ్యాక్ ఇస్తుందనేది ఆసక్తికరం!