లక్నో: చెన్నై జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni).. తాజా ఐపీఎల్ మ్యాచుల్లో తన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. చివరి మూడు ఓవర్లలో క్రీజ్‌లోకి వస్తున్న అతను.. భారీ షాట్లతో అలరిస్తున్నాడు. ధోనీ పవర్ హిట్టింగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. శుక్రవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనూ అతను 9 బంతులు ఆడి 28 రన్స్ చేశాడు. చాలా ధాటిగా ఆడుతున్న ధోనీ.. ఎందుకు ఎక్కువ ఓవర్లు ఉండగానే బ్యాటింగ్‌కు రావడం లేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ముంబైతో మ్యాచ్‌లో నాలుగు బంతుల్లోనే 20 రన్స్ చేశాడు. ఇక లక్నోతో మ్యాచ్‌లో 9 బంతుల్లో 28 రన్స్ చేశాడు. ఇంత పవర్ గేమ్ ఆడుతున్న ధోనీని ఎందుకు ముందు ఆడించడం లేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో మాజీ కెప్టెన్ ధోనీని ముందుకు ఎందుకు పంపడం లేదో కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు.
ధోనీ ఇంకా మోకాలి నొప్పి నుంచి కోలుకుంటున్నారని కోచ్ చెప్పాడు. గత ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోనీ .. తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత సీజన్లో ధోనీ ఆడుతున్న తీరు ఆకట్టుకుంటోందని, కానీ అతను మోకాలి సమస్య నుంచి కోలుకుంటున్నాడని, దాని వల్ల అతను ఎక్కువ బంతులు ఆడలేడని, కొన్ని బాల్స్‌కు మాత్రమే అతను తన ఎనర్జీని వాడుకోగలడని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపారు.
ధోనీ చాలా సేపు క్రీజ్‌లో ఉండాలని చాలా మంది ఆశిస్తుంటారని, కానీ ఆ ప్రశ్నలకు కోచ్ ఫ్లెమింగ్ తనదైన శైలిలో స్పందించారు. టోర్నీ చివరి వరకు దోనీ అవసరమని, అందుకే అతన్ని ముందుకు పంపడం లేదన్నారు. లక్నోతో మ్యాచ్‌లో చివరి ఓవర్లలో ధోనీ మూడు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు దంచాడు. చివరి రెండు లేదా మూడు ఓవర్లలో ధోనీ కీలక ఇన్నింగ్స్ ఆడుతాడని, అయితే బ్యాటింగ్ వరసలో ముందున్న ప్లేయర్లు స్కోరింగ్‌పై దృష్టి పెట్టాలని, చివరలో వచ్చిన ధోనీ ఆ పొజిషన్‌ను మెరుగుపరుస్తాడని ఫ్లెమింగ్ తెలిపాడు. ప్రస్తుతం ధోనీ ఆడుతున్న తీరు పట్ల గర్వంగా ఉందన్నాడు.