CSK CEO : ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే గుర్తుకొచ్చే గొప్ప ఆటగాళ్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) పేరు ముందు వరుసలో ఉంటుంది. తన ఆటతో, తన మేనియాతో ఐపీఎల్‌కు పిచ్చి క్రేజ్ తెచ్చాడు మహీ భాయ్. అంతేనా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన వీరుడు అతడు. అయితే.. 18వ సీజన్లో ధోనీ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ ఆడినా అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడా? అందుకు బీసీసీఐ అనుమతిస్తుందా? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఒకింత ఆసక్తి రేపుతున్నాయి.
ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ (Kasi Viswanathan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీని అట్టిపెట్టుకోవడంపై ఆయన ఏం అన్నాడంటే..? తన మార్క్ కెప్టెన్సీతో చెన్నై జట్టుకు వన్నె తెచ్చిన ధోనీ 17వ సీజన్‌తో కెప్టెన్‌గా వైదొలిగాడు. వికెట్ కీపర్‌గానే కొనసాగుతూ ఫినిషర్‌గా తన ముద్ర వేశాడు. అయితే.. 18వ సీజన్లో ధోనీ అన్క్యాప్డ్గా ఆడుతాడు? అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టత ఇచ్చాడు.
CSK CEO :
While speaking with Dhoni, he said, ‘I will tell you before October 31.’ We also have the desire and hope that he will play for CSK. 😂💥@MSDhoni #IPL #CSK #WhistlePodu pic.twitter.com/RRtDrcwTyC
— MSDian™ (@ItzThanesh) October 20, 2024
‘మేము కూడా ధోనీ సీఎస్కే తరఫున ఆడాలని కోరుకుంటున్నాం. కాన, ఆ విషయంపై ధోనీ ఓ నిర్ణయానికి రావాలి. ధోనీని రిటైన్ చేసుకుంటామా? లేదా? అనే విషయాన్ని అక్టోబర్ 31వ తేదీలోపు వెల్లడిస్తాను. మహీ వచ్చే సీజన్ కచ్చితంగా ఆడుతాడని మేము ఆశిస్తున్నాం’ అని విశ్వనాథన్ ఓ ప్రకటనలో తెలిపాడు. 18వ సీజన్ మెగా వేలానికి ముందు ప్రతి జట్టు ఆరుగురిని మాత్రమే అట్టిపెట్టుకోవాలని బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంచైజీలకు చెప్పింది. దాంతో, పలు జట్లు కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలని భావిస్తున్నాయి. సీఎస్కే కూడా ధోనీ, జడేజా, గైక్వాడ్‌లను అట్టిపెట్టుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.