MS Dhoni : భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పదహారో సీజన్ ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నాడు. మరోసారి తన బ్యాటింగ్ విన్యాసాలు, కెప్టెన్సీతో సీఎస్కేను విజేతగా నిలిపేందుకు ఐపీఎల్లో బరిలోకి దిగనున్నాడు. త్వరలోనే సీజన్ ప్రారంభం కానుండడంతో ప్రాక్టీస్ కోసం అతను ఈరోజు చెన్నైలో అడుగుపెట్టాడు.. ఈ లెజెండరీ కెప్టెన్ రాక గురించి తెలుసుకున్న అభిమానులు విమానాశ్రయం చేరుకుని అతనికి గ్రాండ్ వెల్కం చెప్పారు.
ఆ తర్వాత దోనీ తన కారులో టీమ్ బస చేసిన హోటల్‌కు వెళ్లాడు. ధోనీ చెన్నైకి వచ్చిన ఫొటోలను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దానికి ‘ఎట్టకేలకు తాలా దర్శనం దొరికింది’ అంటూ క్యాప్షన్ రాసింది.
దాదాపు పది నెలల తర్వాత ధోనీ మైదానంలోకి దిగనున్నాడు. 2022 మే నుంచి అతను క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన ధోనీ మరోసారి చెన్నై జట్టును నడిపించనున్నాడు. గత సీజన్ మధ్యలో సీఎస్కే యాజమాన్యం రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించడం, తిరిగి ధోనీకి బాధ్యతలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. జడేజా సారథ్యంలో ఆ జట్టు ఆడిని 8 మ్యాచుల్లో కేవలం రెండింటిలోనే గెలుపొందింది. దాంతో, ఆ జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో మళ్లీ పూర్వ వైభవం సాధించాలని సీఎస్కే భావిస్తోంది. ఆ జట్టు వేలంలో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను రూ.18.25 కోట్లకు కొనుగోలు చేసింది.
ధోనీ ఈ సీజన్‌తో ఐపీఎల్‌కు గుడ్ బై చెప్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో, తర్వాతి కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది. ధోనీ వారసుడిగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సరైనోడని అనుకుంటున్నారంతా. కెప్టెన్సీ రేసులో అందరికంటే అతనే ముందు వరుసలో ఉన్నాడు. ప్రస్తుతం స్టోక్స్ ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2023 మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో సీఎస్కే జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్‌తో పోటీపడనుంది.
Thala Dharisanam, finally! 🦁#DencomingDay pic.twitter.com/rQpinM3vrZ
— Chennai Super Kings (@ChennaiIPL) March 2, 2023