రియాద్ (సౌదీ): ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్నాడా? త్వరలోనే అతడు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇటీవల పీర్స్ మోర్గాన్ అన్సెన్సార్డ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 40 ఏండ్ల ఈ అల్ నజర్ స్టార్ మాట్లాడుతూ.. ‘త్వరలోనే (రిటైర్మెంట్పై).. కానీ అందుకు నేను మానసికంగా సిద్ధమవ్వాలి. అది చాలా కఠినమైన నిర్ణయం.
బహుశా నేను ఏడుస్తానేమో! కానీ నా భవిష్యత్‌పై నాకు 25 ఏండ్ల నుంచే సిద్ధమయ్యాను. ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు నన్ను నేను మానసికంగా సిద్ధం చేసుకున్నా’ అని చెప్పాడు. ఆట నుంచి విరామం తీసుకున్నాక తన కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు వెచ్చిస్తానని చెప్పిన రొనాల్డో.. ఫుట్‌బాల్ అంటే ఇష్టమున్న తన కుమారుడిని తీర్చిదిద్దేందుకు సమయం కేటాయిస్తానని చెప్పకనే చెప్పాడు. సౌదీ ఫుట్‌బాల్ క్లబ్ అల్ నజర్‌తో రొనాల్డో ఒప్పందం 2027 దాకా ఉంది.