Rinku-Priya Wedding | జౌన్‌పూర్‌లోని మచ్లిషహర్ ఎంపీ ప్రియా సరోజ్ సింగ్, ప్రముఖ క్రికెటర్ రింకు సింగ్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వీరిద్దరి నిశ్చితార్థం ఈ నెల 8న లక్నోలో జరుగనున్నది. ఇక వివాహం నవంబర్ 18న వారణాసిలోని హోటల్ తాజ్‌లో జరుగనున్నది. ఈ వివాహ వేడుకకు క్రికెటర్లతో పాటు సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు హాజరు కానున్నారు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న అలీగఢ్‌కు చెందిన రింగు సింగ్ ప్రియాను వివాహం చేసుకోనున్నారు. తొలిసారి ఎంపీగా ఎన్నికైన ప్రియా సరోజ్ తండ్రి కెరాకట్ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ ఎమ్మెల్యే అయిన తుఫానీ సరోజ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
అలీగఢ్‌లో రింకు కుటుంబాన్ని కలిశానని ఎమ్మెల్యే చెప్పారు. కుటుంబ సభ్యులు వివాహానికి సిద్ధంగా ఉన్నారని.. ఐపీఎల్ తర్వాత వివాహం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎంగేజ్మెంట్ వేడుక తేదీని నిర్ణయించినట్లు తెలిపారు. సంప్రదాయబద్ధంగా వివాహం జరుగుతుందని.. దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులు, క్రికెటర్లు, సినీ తారలు హాజరవుతారన్నారు. ప్రియా సరోజ్ వృత్తిరీత్యా న్యాయవాది కాగా.. ప్రియా, రింకు ఇద్దరికి పరిచయం ఉంది. పరిచయం స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు సైతం అంగీకరించాయి.
రింకు సింగ్ 1997 అక్టోబర్ 12న అలీఘగ్లోని చాలా సాధారణ కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి ఖాంచంద్ర గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్లు పంపిణీ చేసేవాడు. రింకు సైతం తండ్రికి సహకారం అందిస్తుండే వాడు. పేదరికం నుంచి వచ్చినా క్రికెట్‌ను కెరియర్‌గా ఎంచుకొని టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐపీఎల్లో 2023 సీజన్లో కేకేఆర్ తరఫున అద్భుత ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత టీ20 క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వన్డే జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేకేఆర్ రూ.13కోట్లకు రిటైన్ చేసుకుంది. రింకు సింగ్‌ని 2017లో కింగ్స్‌లెవెన్ పంజాబ్ రూ.10లక్షలు కొనుగోలు చేసింది. ఆ సమయంలో తుది జట్టులో చోటు దక్కలేదు. 2018 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.80 లక్షలకు తమ జట్టులో చేర్చుకుంది. ప్రస్తుతం రింకు వార్షిక ఆదాయం దాదాపు రూ.60 నుంచి రూ.80లక్షల ఆదాయం ఉంటుందని అంచనా. 2024 రింకు సింగ్ ఆస్తులు దాదాపు రూ.8 కోట్లుగా అంచనా.