న్యూఢిల్లీ: 2028 సంవత్సరంలో లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్(Los Angles Olympics) క్రీడల్లో .. క్రికెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఆ మెగా ఈవెంట్లో మహిళల, పురుషులకు చెందిన ఆరేసి జట్లు పాల్గొననున్నాయి. దీన్ని ఒలింపిక్ కమిటీ బుధవారం కన్ఫర్మ్ చేసింది. దాదాపు శతాబ్ధం కాలం నుంచి ఒలింపిక్స్‌లో క్రికెట్ లేదు. చివరిసారి 1900వ సంవత్సరంలో పారిస్‌లో జరిగిన క్రీడల్లో క్రికెట్ ఆడారు. అప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్ జట్ల మద్య రెండు రోజుల మ్యాచ్ జరిగింది.
టీ20 ఫార్మాట్లో ఆరు జట్లతో క్రికెట్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళల, పురుషుల విభాగాల్లో క్రికెట్ ఆడనున్నారు. ప్రతి విభాగంలోనూ 90 మంది అథ్లెట్ల కోటాను నిర్దారించారు. ప్రతి జట్టు 15 మంది సభ్యుల బృందాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్ మండలిలో మొత్తం 12 పూర్తి సభ్యత జట్లు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీ, జింబాబ్వే దేశాలు ఉన్నాయి. వీటితో పాటు 94 అసోసియేట్ సభ్య దేశాలు ఉన్నాయి.
ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో పురుషుల విభాగంలో ఇండియా, మహిళల విభాగంలో న్యూజిలాండ్ ప్రపంచ విజేతలుగా ఉన్నాయి. ఈవెంట్ ప్రోగ్రామ్‌ను, అథ్లెట్ కోటాను .. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలికింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగే క్రీడల్లో కొత్తగా అయిదు ఆటలకు అవకాశం కల్పించారు. క్రికెట్‌తో పాటు బేస్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోసీ, స్క్వాష్‌లకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే వేదికలను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఒలింపిక్స్ సమీపిస్తున్న సమయలో షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు చెప్పారు.