లండన్: క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా దోస్త్ మేరా దోస్త్ అంటూ చక్కర్లు కొడుతున్నారు. తమ అద్భుత బ్యాటింగ్ నైపుణ్యంతో కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న ఈ ఇద్దరు రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ వరకు బిజీగా గడిపిన ఈ క్రికెట్ ఐకాన్లు లండన్ వీధుల్లో సాధారణ పౌరుల వలే నడుచుకుంటూ వెళ్తున్న ఫొటో సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నది. లారాతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన సచిన్ ఆసక్తికర కామెంట్ రాసుకొచ్చాడు.
‘మెరుగైన నైపుణ్యం కల్గిన మరో గోల్ఫర్తో కలిసి ముందుకు సాగుతున్నాను’ అంటూ నవ్వుతున్న ఇమోజీలను మాస్టర్ పోస్ట్ చేశాడు. దీనిపై పలువురు తమదైన శైలిలో కామెంట్లు రాసుకొచ్చారు. ‘ఆల్టైమ్ గ్రేట్ క్రికెటర్లు లండన్ వీధుల్లో విహరిస్తున్నారు’ అని ఒకరు రాసుకు రాగా, ‘ఏ శకానికైనా వీరిద్దరు గొప్ప బ్యాటర్లు’ అని మరొకరు తమ అభిమానాన్ని చాటుకున్నారు.