(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌పై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానాన్ని సొమ్ము చేసుకొనే ఇలాంటి వాళ్లు ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి, భారీగా లాభాలు అర్జించిన ప్రముఖుల వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత కొంతకాలంగా దర్యాప్తు కొనసాగిస్తున్నది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో రైనా, శిఖర్ ధావన్‌కు చెందిన రూ. 11 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. దీనిపై ఓ ఇంగ్లీష్ పత్రిక కథనాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేసిన సజ్జనార్ తీవ్రంగా స్పందించారు.
‘వీళ్లేం ఆటగాళ్లు? అభిమానాన్ని కూడా సొమ్ముచేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? బెట్టింగ్ మహమ్మారికి వ్యసనపరులై ఎంతోమంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకొంటున్నారు. వేలాదిమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా?’ అం టూ ప్రశ్నించారు. ‘సమాజ మేలు కోసం, యువత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పండి. అంతేగానీ మిమ్మల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవపట్టించి వారి ప్రాణాలను తీయకండి’ అంటూ హితవు పలికారు. సజ్జనార్ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.