హైదరాబాద్, ఆట ప్రతినిధి : గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన క్రికెటర్ల అభివృద్ధికి సహకరించాలని తెలంగాణ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్(టీడీసీఏ) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీసీఏకు బీసీసీఐ గుర్తింపు నివ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమెరికా క్రికెట్ బోర్డు చైర్మన్ వేణురెడ్డిని సాట్స్ చైర్మన్ శివాసేనారెడ్డితో కలిసి టీడీసీఏ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా టీడీసీఏ 2025 క్యాలెండర్‌తో పాటు అండర్-16 టోర్నీ ట్రోఫీలను ఆవిష్కరించారు. తెలంగాణ బిడ్డ అగ్రరాజ్యం అమెరికా క్రికెట్ బోర్డు చైర్మన్ కావడం సంతోషంగా ఉందని శివసేనారెడ్డి పేర్కొన్నారు. ‘అమెరికాలో క్రికెట్‌ను ఐసీసీ గత ఐదేండ్ల కాలంలోనే గుర్తించింది. నేను చైర్మన్‌గా ఉన్న సమయంలోనే టీ20 ప్రపంచకప్‌నకు అమెరికా ఆతిథ్యమివ్వటం, అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీకి అర్హత సాధించింది. తెలంగాణలో గ్రామీణ క్రికెట్ పురోగతి సాధించాలి’ అని వేణురెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్జేఎఫ్ చైర్మన్ రామిరెడ్డి, పెటా అధ్యక్షుడు రాఘవరెడ్డి, సురేందర్‌రెడ్డి, టీడీసీఏ జిల్లా కన్వీనర్లు, క్రికెటర్లు తదితరులు పాల్గొన్నారు.