శనివారం 16 జనవరి 2021
Sports - Dec 05, 2020 , 01:41:52

కాంకషన్‌ విన్‌

కాంకషన్‌ విన్‌

  • తొలి టీ20లో భారత్‌ జయభేరి
  • రాణించిన రాహుల్‌, జడేజా
  • విజృంభించిన నటరాజన్‌, చాహల్‌

టాపార్డర్‌లో ముగ్గురు ఆటగాళ్లు రెండంకెల స్కోరు చేయలేకపోయినా.. ఆరంభంలో లోకేశ్‌ రాహుల్‌, ఆఖర్లో రవీంద్ర జడేజా దంచి కొట్టడంతో పోరాడే స్కోరు చేసిన టీమ్‌ఇండియా.. సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ ధారాళంగా పరుగులిచ్చిన చోట  నటరాజన్‌, చాహల్‌ మూడేసి వికెట్లు పడగొట్టడంతో  టీ20 సిరీస్‌లో బోణీ కొట్టింది. తుదిజట్టులో లేని యుజ్వేంద్ర చాహల్‌.. కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగి ఆసీస్‌ను అల్లాడిస్తే..  నటరాజన్‌ అరంగేట్రంలోనే తన యార్కర్‌ పవర్‌ ఏంటో కంగారూలకు రుచి చూపించాడు.

కాన్‌బెర్రా: వన్డే సిరీస్‌ పరాజయం అనంతరం అప్రమత్తమైన టీమ్‌ఇండియా.. పొట్టి ఫార్మాట్‌లో శుభారంభం చేసింది. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. నటరాజన్‌ యార్కర్లు, చాహల్‌ ఫ్లిప్పర్లతో దుమ్మురేపడంతో శుక్రవారం ఇక్కడి మనూకా ఓవల్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో కోహ్లీసేన 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. లోకేశ్‌ రాహుల్‌ (40 బంతుల్లో 51; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) అదరగొట్టగా.. రవీంద్ర జడేజా (23 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) చివర్లో మెరుపులు మెరిపించాడు. ఆసీస్‌ బౌలర్లలో హెన్రిక్స్‌ 3, స్టార్క్‌ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులే చేసింది. ఫించ్‌ (35), షార్ట్‌ (34), హెన్రిక్స్‌ (30) ఫర్వాలేదనిపించారు. భారత్‌ బౌలర్లలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' చాహల్‌, నటరాజన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం ఇక్కడే జరుగనుంది. 

రాహుల్‌ స్టార్ట్‌.. జడేజా ఫినిష్‌..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. స్టార్క్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ధవన్‌ (1) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఓ ఎండ్‌లో రాహుల్‌ నిలకడగా ఆడుతున్నా.. మరో ఎండ్‌లో విరాట్‌ కోహ్లీ (9) ఆకట్టుకోలేకపోయాడు. స్వెప్సన్‌ బౌలింగ్‌లో అతడికే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి టీమ్‌ఇండియా 75/2తో నిలిచింది. ఉన్నంత సేపు ధాటిగా ఆడిన సంజూ శాంసన్‌ (23).. హెన్రిక్స్‌కు దొరికిపోగా.. మనీశ్‌ పాండే (2) అలా వచ్చి ఇలా వెళ్లాడు. అర్ధశతకం అనంతరం రాహుల్‌ కూడా ఔట్‌ కావడంతో.. జట్టు కష్టాల్లో పడింది. వన్డే సిరీస్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన హార్దిక్‌ పాండ్యా (16) స్కోరు పెంచే క్రమంలో డగౌట్‌ చేరగా.. ఆఖర్లో జడేజా బాదే బాధ్యత తీసుకున్నాడు. తొడ కండరాలు పట్టేయడంతో భారీ షాట్లకే పరిమితమైన జడ్డూ.. చివరి రెండు ఓవర్లలో 34 పరుగులు రాబట్టడం గమనార్హం. 19వ ఓవర్‌లో 4,6,4,4 బాదిన జడేజా ఆఖరి ఓవర్‌లో మరో రెండు ఫోర్లు అరుసుకోవడంతో భారత్‌ పోరాడే స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో చివరి ఓవర్‌లో స్టార్క్‌ బంతి జడ్డూ తలకు తగలడంతో అతడి స్థానంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా చాహల్‌ ఫీల్డ్‌లోకి వచ్చాడు. 

చాహల్‌, నట్టూ చెరో మూడు..

లక్ష్యఛేదనలో ఆసీస్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. వార్నర్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన షార్ట్‌ చక్కటి షాట్లతో ఆకట్టుకోగా.. కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ ఫామ్‌ కొనసాగించాడు. దీపక్‌ చాహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే 14 పరుగులు రాగా.. మహమ్మద్‌ షమీ తన తొలి రెండు ఓవర్‌లలో 22 పరుగులు ఇచ్చుకున్నాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్‌ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. వడివడిగా లక్ష్యం వైపునకు సాగుతున్న ఆసీస్‌కు చాహల్‌ కళ్లెం వేశాడు. తన తొలి ఓవర్‌లో ఫించ్‌ను ఔట్‌ చేసిన ఈ లెగ్‌స్పిన్నర్‌ మరుసటి ఓవర్‌లో స్మిత్‌ (12)ను పెవిలియన్‌ పంపాడు. అదే సమయంలో ప్రమాదకర మ్యాక్స్‌వెల్‌ (2)ను నటరాజన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో స్కోరు వేగం తగ్గింది. విజయానికి 37 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన దశలో షార్ట్‌.. వెడ్‌ (7), హెన్రిక్స్‌ ఔట్‌కావడంతో ఆసీస్‌ ఓటమి ఖాయమైంది. 

కాంకషన్‌ సబ్‌గా వచ్చి..

తొలి రెండు వన్డేల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన యుజ్వేంద్ర చాహల్‌.. ఆ తర్వాత బెంచ్‌కే పరిమితమయ్యాడు. టీ20ల్లో వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజాను కాదని అతడికి తుదిజట్టులో అవకాశం వస్తుందని ఎవరూ ఊహించలేదు. అందుకు తగ్గట్లే జట్టు ఎంపిక సాగింది. భారత ఇన్నింగ్స్‌ ముగిసేవరకు అదనపు ఆటగాడిగా బెంచ్‌కే పరిమితమైన చాహల్‌.. జడేజా గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా గెలుపు బాటలో పయనిస్తున్న సమయంలో బంతినందుకున్న చాహ ల్‌.. వరుస ఓవర్లలో ఫించ్‌, స్మిత్‌ను ఔట్‌ చేసి కంగారూలను దెబ్బకొట్టాడు. చివరి ఓవర్‌లో వెడ్‌ను కూడా తన ఖాతాలో వేసుకొని కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టాడు. బౌండ్రీ బయట ఆసీస్‌ హెడ్‌కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ఈ విషయంపై మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌తో వాదించడం వివాదానికి దారి తీసింది. 2019 జూలైలో ఐసీసీ కాంకషన్‌ నిబంధనను అమల్లోకి తేగా.. టీమ్‌ఇండియా తరఫున చాహల్‌ తొలి ఆటగాడిగా నిలిచాడు.

అరంగేట్రంలో మూడు వికెట్లు

వన్డేల్లో అరంగేట్రం చేసిన మూడో రోజే నటరాజన్‌ టీమ్‌ఇండియా తరఫున తొలి టీ20 ఆడాడు. మ్యాచ్‌కు ముందు స్పీడ్‌ స్టర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అతడికి టీమ్‌ఇండియా క్యాప్‌ అందించాడు. తొలి వన్డేలో ఒక వికెట్‌ పడగొట్టి ఫర్వాలేదనిపించిన ఈ యార్కర్‌ స్పెషలిస్ట్‌.. అరంగేట్ర టీ20లో 3 వికెట్లతో అదరగొట్టడం విశేషం.

స్కోరు బోర్డు

భారత్‌: రాహుల్‌ (సి) అబాట్‌ (బి) హెన్రిక్స్‌ 51, ధవన్‌ (బి) స్టార్క్‌ 1, కోహ్లీ (సి అండ్‌ బి) స్వెప్సన్‌ 9, శాంసన్‌ (సి) స్వెప్సన్‌ (బి) హెన్రిక్స్‌ 23, మనీశ్‌ (సి) హజిల్‌వుడ్‌ (బి) జంపా 2, హార్దిక్‌ (సి) స్మిత్‌ (బి) హెన్రిక్స్‌ 16, జడేజా (నాటౌట్‌) 44, సుందర్‌ (సి) అబాట్‌ (బి) స్టార్క్‌ 7, చాహర్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 161/7. వికెట్ల పతనం: 1-11, 2-48, 3-86, 4-90, 5-92, 6-114, 7-152, బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-32-2, హజిల్‌వుడ్‌ 4-0-39-0, జంపా 4-0-20-1, అబాట్‌ 2-0-23-0, స్వెప్సన్‌ 2-0-21-1, హెన్రిక్స్‌ 4-0-22-3.

ఆస్ట్రేలియా: షార్ట్‌ (సి) హార్దిక్‌ (బి) నటరాజన్‌ 34, ఫించ్‌ (సి) పాండ్యా (బి) చాహల్‌ 35, స్మిత్‌ (సి) శాంసన్‌ (బి) చాహల్‌ 12, మ్యాక్స్‌వెల్‌ (ఎల్బీ) నటరాజన్‌ 2, హెన్రిక్స్‌ (ఎల్బీ) దీపక్‌ 30, వెడ్‌ (సి) కోహ్లీ (బి) చాహల్‌ 7, అబాట్‌ (నాటౌట్‌) 12, స్టార్క్‌ (బి) నటరాజన్‌ 1, స్వెప్సన్‌ (నాటౌట్‌) 12, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 150/7. వికెట్ల పతనం: 1-56, 2-72, 3-75, 4-113, 5-122, 6-126, 7-127, బౌలింగ్‌: దీపక్‌ 4-0-29-1, సుందర్‌ 4-0-16-0, షమీ 4-0-46-0, నటరాజన్‌ 4-0-30-3, చాహల్‌ 4-0-25-3.