(స్పెషల్ టాస్క్ బ్యూరో)
Sports Federations | హైదరాబాద్, నమస్తే తెలంగాణ : భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు (డబ్ల్యూఎఫ్ఐ), బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, ఆయనకు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన నిరసనలు, వారిపై పోలీసుల వైఖరి తదితర ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో స్పోర్ట్స్ ఫెడరేషన్లలో మహిళా ప్లేయర్లకు రక్షణ ఎలా ఉన్నది? 2013లో తీసుకొచ్చిన లైంగిక వేధింపుల నివారణ చట్టం (పోష్) ఎలా అమలు అవుతున్నది? ఫెడరేషన్లలో కమిటీల ఏర్పాటు, వాటి పనితీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో ఉన్న మొత్తం 30 జాతీయ స్పోర్ట్స్ ఫెడరేషన్లలో 16 ఫెడరేషన్లలో పోష్ చట్టం సవ్యంగా అమలవ్వట్లేదని, లైంగిక వేధింపుల ఆరోపణలపై అంతర్గతంగా విచారణ జరిపించేందుకు తగిన ఫిర్యాదుల కమిటీలు (ఐసీసీ) ఏర్పాటు కాలేదని, మరికొన్ని సంఘాల్లో మార్గదర్శకాలకు అనుగుణంగా ఐసీసీల్లో తగినంత మంది సభ్యులు లేరని తేలింది. ఈ మేరకు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా అమలవ్వట్లేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదని నిపుణులు ఆరోపిస్తున్నారు.
పేరు: జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాస్టేటస్: ప్రత్యేకంగా ఐసీసీ లేదు. అయితే ఓ విచారణ కమిటీ ఉన్నది.
ఆరుగురు గల ఈ కమిటీలో ఇద్దరు మహిళలు సభ్యులుగా ఉన్నారు. అన్ని సమస్యలకు మాకు ఓ విచారణ కమిటీ ఉన్నది. అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా అది నడుస్తున్నది.
-సుధీర్ మిట్టల్, జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్
పేరు: టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్
ఆఫ్ ఇండియా
స్టేటస్: ఐసీసీ లేదు.
కొన్ని నెలల కిందటే కొత్త అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటైంది. కొద్దిరోజుల్లో ఐసీసీని ఏర్పాటు చేస్తాం.
-కమలేశ్ మెహతా, టీటీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి
పేరు: హ్యాండ్‌బాల్ ఫెడరేషన్
ఆఫ్ ఇండియా
స్టేటస్: ఐసీసీ లేదు
ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం గత ఆగస్టులోనే మాకు ఎన్నికలు జరి గాయి. మే 20న ఏజీఎమ్ నియామకం జరుగనున్నది. అనంతరం కమిటీని ఏర్పాటు చేస్తాం.
-ప్రీత్‌పాల్‌సింగ్ సాలుజా, హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి
పేరు: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
స్టేటస్: ఐసీసీ లేదు
ప్రస్తుత వివాదం నేపథ్యంలో ఫెడరేషన్ రోజూవారీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) నేతృత్వంలో ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
పేరు: వాలీబాల్ ఫెడరేషన్
ఆఫ్ ఇండియా
స్టేటస్: ఐసీసీ లేదు
లైంగిక వేధింపుల ఘటనలు జరిగితే సాధారణ సమావేశాల్లో చర్చకు తీసుకురావచ్చు. దీని కోసం ప్రత్యేకంగా కమిటీలు ఉండవు.
– అనిల్ చౌదరి, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి