పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో పోలండ్ బ్యూటీ ఇగా స్వియాటెక్ జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసిన ఆమె లక్ష్యానికి మరో రెండడుగుల దూరంలో నిలిచింది. మంగళవారం ఫిలిప్పి చాట్రియర్ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఒకటో సీడ్ స్వియాటెక్.. 6-0, 6-2తో మర్కెట వొండ్రుసోవా (చెక్)ను వరుస సెట్లలో ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లింది.
పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ పోరును గంటా 2 నిమిషాల్లోనే ముగించిన డిఫెండింగ్ చాంపియన్.. సెమీస్‌లో అమెరికా అమ్మాయి కోకో గాఫ్‌తో తలపడనుంది. మరో క్వార్టర్స్‌లో గాఫ్.. 4-6, 6-2, 6-3తో 8వ సీడ్ ఒన్స్ జబేర్ (ట్యూనిషియా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో ఇటలీ కుర్రాడు జన్నిక్ సిన్నర్.. 6-2, 6-4, 7-6 (7/3)తో దిమిత్రోవ్ (బల్గేరియా)ను చిత్తు చేసి సెమీస్ లోకి ప్రవేశించాడు.