CAFA Nations Cup : సెంట్రల్ ఆసియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (CAFA) నేషన్స్ కప్ ప్రాబబుల్స్‌లో మాజీ సారథి సునీల్ ఛెత్రీ (Sunil Chhetri) పేరు లేదు. జట్టుకోసం వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఛెత్రీని తీసుకోకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అలిండియా ఫుట్‌బాల్ సమాఖ్యను అడిగితే.. కోచ్ సమాధానం చెబుతాడని దాటవేసింది. ఈ నేపథ్యంలో లెజెండరీ ఆటగాడిని తప్పించడం వెనక కారణం ఉందంటున్నాడు కోచ్ ఖలిద్ జమిల్.
‘సునీల్ ఛెత్రీ భారత ఫుట్‌బాల్‌కు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. అతడొక దిగ్గజ ప్లేయర్. అతడికి జట్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. సెంట్రల్ ఆసియా ఫుట్‌బాల్ అసోసియేషన్ నేషన్స్ కప్ ప్రాబబుల్స్‌కు అతడికి ఎందుకు ఎంపిక చేయలేదంటే అదొక టోర్నమెంట్ మాత్రమే. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు సన్నాహకంగా ఈ కప్ ఉపయోగపడనుంది. కానీ, కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలనుకున్నాం. అందుకే ఛెత్రీని ఎంపిక చేయలేదు అని జమిల్ వివరణ ఇచ్చాడు.
Khalid Jamil 🗣️#BlueTigers #IndianFootball ⚽️ pic.twitter.com/jt6Q0gnDqH
— Indian Football Team (@IndianFootball) August 17, 2025
టీమిండియాకు సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన సునీల్ ఛెత్రీ నిరుడు జూన్‌లో వీడ్కోలు పలికాడు. అతడు జట్టును వీడాక ప్రమాణాలు మరింత పడిపోయాయి. దాంతో.. టీమ్‌ను గట్టెక్కించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది యూటర్న్ తీసుకున్నాడీ వెటరన్. చెత్త ఆటతో వరుసగా ఓడిపోతున్న బ్లూ టైగర్స్‌ను విజయపథాన నడిపించాలనుకున్నాడు. అయితే.. నేషన్స్ కప్ కోసం ఎంపిక చేసిన 35 మందిలో ఛెత్రీకి చోటు దక్కలేదు.
కానీ, అతడు ఆడుతున్న బెంగళూరు ఎఫ్‌సీ(Bengaluru FC)కి చెందిన ఆటగాళ్లు మాత్రం స్క్వాడ్‌లో ఉన్నారు. గుర్ప్రీత్ సింగ్, రాహుల్ భెకే, రోషన్ సింగ్, సురేష్ సింగ్‌లను తీసుకున్న సెలెక్టర్లు స్టార్ ఫార్వర్డ్ అయిన ఛెత్రీని విస్మరించారు. ఆగస్టు 29న ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్ వేదికగా నేషన్స్ కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత జట్టు గ్రూప్ బీలో ఉంది. ఇందులోనే ఆతిథ్య తజకిస్థాన్, ఇరాన్ అఫ్గనిస్థాన్ ఉన్నాయి.