బరేలి: టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం లేదని, అది పాపమని వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచిన ఆలిండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ మరోసారి అతడిని టార్గెట్ చేశాడు. ఈసారి మౌలానా.. షమీ కూతురు హోలీ ఆడటాన్ని తప్పుబట్టాడు. ఈ మేరకు ఓ వీడియోలో మౌలానా మాట్లాడుతూ… ‘ఆమె (షమీ కూతురు) చిన్న పిల్ల. హోలీ గురించి తెలియకుండా ఆడటం పెద్ద తప్పేమీ కాదు. కానీ తెలిసీ ఆడుతుంటే మాత్రం అది నేరం. నేను షమీ కుటుంబ సభ్యులను ఒక్కటే కోరుతున్నా. షరియత్లో లేని వాటిని మీ ఇంట్లో పిల్లలకు దూరంగా ఉంచండి. హోలీ అనేది హిందూవులకు పెద్ద పండుగ. కానీ ముస్లింలు ఆ పండుగకు దూరంగా ఉండాలి. షరియత్ గురించి తెలిసీ హోలీని జరుపుకుంటే మాత్రం అది నేరమే’ అని వ్యాఖ్యానించాడు.