Chris Silverwood | శ్రీలంక క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి క్రిస్ సిల్వర్‌వుడ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకున్నట్లు లంక క్రికెట్ బోర్డు గురువారం వెల్లడించింది. అయితే, టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టు చెత్త ప్రదర్శనతో కనీసం సూపర్-8 దశకు చేరుకోలేకపోయింది. లీగ్ దశలోనే ఇంటిబాటపట్టింది. ఇప్పటికే కన్సల్టెంట్ కోచ్‌గా ఉన్న మహేలా జయవర్ధనే సైతం తన పదవి నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో క్రిస్ సిల్వర్‌వుడ్ సైతం హెడ్‌కోచ్ పదవికి రాజీనామా గమనార్హం. ‘అంతర్జాతీయ కోచ్‌గా ఉండడం అంటే.. చాలాకాలం పాటు సొంతవారికి దూరంగా ఉండాలి. కుటుంబంతో చర్చించాక భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాను.
శ్రీలంక క్రికెట్లో భాగం కావడం నాకు నిజమైన గౌరవం. నేను ఇక్కడ ఎన్నో మధురమైన జ్ఞాపకాలను కూడగట్టుకున్నాను’ అని సిల్వర్‌వుడ్ పేర్కొనట్లుగా బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. సిల్వర్ వుడ్ 2022 ఏప్రిల్‌లో శ్రీలంక జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలో లంక జట్టు అదే ఏడాది జరిగిన ఆసియాకప్‌లో విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన వన్డే ద్వైపాక్షిక సిరీస్‌లోనూ గెలుపొందింది. 2023 ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఆరు నెలల్లో జరిగిన వన్డే ప్రపంచకప్, టీ20 వరల్డ్ కప్‌లో లంక జట్టు చెత్త ప్రదర్శనతో లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. అలాగే, వచ్చే ఏడాది పాక్‌లో జరిగే ఐసీసీ చాంఫియన్స్ ట్రోఫీకి సైతం అర్హత సాధించలేకపోయింది. ఈ క్రమంలో హెడ్‌కోచ్ సిల్వర్వుడ్తో పాటు కన్సల్టెంట్‌గా ఉన్న జయవర్ధనే సైతం తమ పదవుల నుంచి తప్పుకున్నారు.