ముంబై : దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా.. ఇంగ్లండ్ టూర్‌కు ఇండియన్ జట్టు రెఢీ అయ్యింది. ఆ ఇద్దరు మేటి బ్యాటర్లు ఇటీవల టెస్టలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ టూర్ కోసం ఇవాళ 18 మంది సభ్యుల బృందాన్ని ప్రకటించిన సమయంలో.. భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ, రోహిత్ రిటైరయ్యారని, వాళ్ల స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని అగార్కర్ పేర్కొన్నారు. అయితే ఇంగ్లండ్ టూరులో ఇతర ఆటగాళ్లు వారి పాత్రలను పోషిస్తారని ఆశిస్తున్నట్లు చీఫ్ సెలెక్టర్ తెలిపారు.
మే 7వ తేదీన రోహిత్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. మే 12వ తేదీన కోహ్లీ కూడా టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. ఆ ఇద్దరూ క్రికెట్లో పెద్ద ప్లేయర్లు అని, అలాంటి ఆటగాళ్లు రిటైర్ అయితే, వాళ్ల స్థానాన్ని నింపడం కష్టమైన పని అని, కానీ ఇతరులు దాన్ని అవకాశంగా మలుచుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆ ఇద్దరు సూపర్స్టార్ల స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సాయి సుదర్శన్, మరో బ్యాటర్ కరుణ్ నాయర్‌ను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.
గత నెలలోనే కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ గురించి తనతో సంప్రదించినట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించారు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతను తన టెస్టు క్రికెట్ గురించి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీని అతను ఆశ్రయించాడని, ఎంత ఆడాలో అంత ఆడినట్లు చెప్పాడని, ప్రమాణాలకు తగినట్లు ఆడలేనని భావిస్తున్న క్షణంలో ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సి ఉంటుందన్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ పెర్త్ టెస్టులో సెంచరీ చేశాడు. కానీ అయిదు టెస్టుల సిరీస్‌లో అతను కేవలం 190 రన్స్ మాత్రమే చేశాడు. ఆ సిరీస్‌లో అతని బ్యాటింగ్ సగటు 23గా ఉంది. తొలి టెస్టు తర్వాత జట్టుతో చేరిన రోహిత్ కూడా ఎక్కువ ప్రభావం చూపలేకపోయాడు. ఆ సిరీస్‌లో అతను 6.2 సగటుతో కేవలం 31 రన్స్ మాత్రమే చేశాడు. సిడ్నీ టెస్టులో అతను ఆడలేదు. ఆ సిరీస్ పర్ఫార్మెన్స్ ఆధారంగా వాళ్ల రిటైర్మెంట్ అంశంపై పునరాలోచన చేయలేకపోయినట్లు అగార్కర్ తెలిపాడు. అయితే 2025-27 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ బ్యాటర్లను ఎంపిక చేయాల్సి వచ్చిందన్నాడు.
ఆటగాళ్లు ఎవరైనా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటే, అది తనకు సంబంధం లేనిదని, రిటైర్మెంట్ అనేది వ్యక్తిగతమైన నిర్ణయమని, కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ ప్రారంభమైందని, మళ్లీ జట్టును నిర్మించే పనిలో పడినట్లు అగార్కర్ తెలిపారు. ఫేర్వెల్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలని కోహ్లీ భావించినట్లు ఊహాగానాలు వినిపించాయి. నిజానికి కోహ్లీయే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.