Cheteshwar Pujara | ఆలూర్: భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా దేశవాళీల్లో దుమ్మురేపాడు. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో వెస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన పుజారా (278 బంతుల్లో 133; 14 ఫోర్లు, ఒక సిక్సర్) సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న పోరులో ఓవర్‌నైట్ స్కోరు 149/3తో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్ట్‌జోన్.. ఆట ముగిసే సమయానికి 292/9తో నిలిచింది. చివరి బంతికి పుజారా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.
చేతిలో ఒక వికెట్ ఉన్న వెస్ట్ జోన్ ప్రస్తుతం 384 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులు చేయగా.. సెంట్రల్ జోన్ 128 రన్స్‌కే ఆలౌటైంది. నార్త్ జోన్‌తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో 215 పరుగుల లక్ష్యఛేదనలో సౌత్‌జోన్ 21/0తో నిలిచింది.