న్యూఢిల్లీ: పొట్టి ఫార్మాట్లో దంచికొడుతున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చే నెల 12 నుంచి వెస్టిండీస్‌తో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం శివసుందర్దాస్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శుక్రవారం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న సెలెక్టర్లు సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాతో పాటు ఉమేశ్ యాదవ్‌కు మొండి చేయి చూపారు. యశస్వితో పాటు ఐపీఎల్లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్‌కూ తొలిసారి టెస్టు జట్టులో చోటు లభించింది. టెస్టు, వన్డే జట్లకు రోహిత్‌శర్మ నాయకత్వం వహించనుండగా.. యువ పేసర్ ముఖేశ్ కుమార్ రెండు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి ఈ పర్యటన నుంచి సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టాప్ స్కోరర్‌గా నిలిచిన అజింక్యా రహానే టెస్టు టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వన్డేల్లో హార్దిక్ పాండ్యా ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
దేశవాళీల్లో టన్నుల కొద్ది పరుగులు చేస్తున్న మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. గత మూడు రంజీ సీజన్లలోనూ 100కు పైగా సగటుతో దుమ్మురేపిన సర్ఫరాజ్‌ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. పేస్ బౌలర్ నవ్‌దీప్ సైనీ టెస్టు జట్టులో చోటు దక్కించుకోగా.. 17 మందితో కూడిన వన్డే జట్టులో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. గాయాల కారణంగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా సెలెక్షన్‌కు అందుబాటులో లేకపోగా.. పుజారా కెరీర్‌కు ఫుల్స్టాప్ పడినట్లే అని బీసీసీఐ అధికారి అన్నారు. ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచి అతడు లయ అందుకోలేకపోతున్నాడని.. గత మూడేండ్లుగా పుజారా ఫామ్ బాగాలేని కారణంగానే కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఐపీఎల్లో పేస్ బౌలర్లను సర్ఫరాజ్ ఖాన్ సరిగ్గా ఎదుర్కోలేకపోవడం వల్లే అతడికి అవకాశం దక్కలేదని ఆయన అన్నారు.
రోహిత్ (కెప్టెన్), గిల్, గైక్వాడ్, కోహ్లీ, యశస్వి, రహానే, భరత్, ఇషాన్, అశ్విన్, జడేజా, శార్దూల్, అక్షర్, సిరాజ్, ముఖేశ్, ఉనాద్కట్, సైనీ.
రోహిత్ (కెప్టెన్), గిల్, గైక్వాడ్, కోహ్లీ, సూర్యకుమార్, శాంసన్, ఇషాన్, పాండ్యా, శార్దూల్, జడేజా, అక్షర్, చాహల్, కుల్దీప్, ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్, ముఖేశ్.