బాకు: ప్రతిష్ఠాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. మెగాటోర్నీలో తన కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ప్లేయర్లను చిత్తుచేస్తూ ఫైనల్ పోరుకు చేరుకున్న ఈ చెన్నై చిన్నోడు.. ప్రపంచ నంబర్‌వన్ కార్ల్సన్తో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాడు. బుధవారం ఇద్దరి మధ్య జరిగిన రెండో గేమ్ డ్రా గా ముగిసింది.
గంటన్నర పాటు సాగిన పోరులో ప్రజ్ఞానంద, కార్ల్సన్ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నం చేశారు. మొత్తంగా చివరికి 30 ఎత్తులతో పోరు డ్రా అయ్యింది. అయితే విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ అనివార్యమైంది. గురువారం జరిగే రెండు టైబ్రేక్ గేమ్‌ల ద్వారా ప్రపంచ చెస్ విజేత ఎవరో తేలిపోనుంది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ తెల్లపావులతో బరిలోకి దిగగా, నల్లపావులతో ప్రజ్ఞానంద ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగాడు. గేమ్ ముగిసిన తర్వాత ప్రజ్ఞానంద మాట్లాడుతూ ‘కార్ల్సన్ ఇంత త్వరగా డ్రాకు అంగీకరిస్తాడని అనుకోలేదు. పోటీ రసవత్తరంగా ఉండటంతో డ్రాకు దారితీసింది. ఒకింత ఒత్తిడిలో ఉన్న నేను గురువారం పోరుకు తాజాగా సిద్ధమవుతా’ అని అన్నాడు.