ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో ఆసియా జట్ల హవా దిగ్విజయంగా కొనసాగుతున్నది. యూరప్ జట్లకు తామేమీ తీసిపోమని చేతల్లో చూపిస్తున్నారు. సౌదీఅరేబియా, జపాన్, కొరియాను స్ఫూర్తిగా తీసుకుంటూ ఇరాన్ తమ సత్తాఏంటో చూపెట్టింది. వేల్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇరాన్
అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డ మ్యాచ్‌లో ఆఖర్లో ఇరాన్ అద్భుతం చేసింది. మ్యాచ్ ఇంజూరీ టైమ్‌లో మూడు నిమిషాల తేడాతో రెండు గోల్స్ చేసి వేల్స్‌ను మట్టికరిపించింది. ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్..సెర్బియాపై బోణీ కొట్టింది. రిచర్లీసన్
డబుల్ గోల్స్‌తో బ్రెజిల్ వరల్డ్‌కప్ వేట మొదలుపెట్టింది. సెనెగల్ చేతిలో ఓడిన ఆతిథ్య ఖతార్ మెగాటోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించింది.
అల్ రయాన్: ఫిఫా ప్రపంచకప్‌లో యూరప్ జట్లకు ఆసియా టీమ్స్ నుంచి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నాయి. టైటిల్ కచ్చితంగా సాధిస్తాయనుకున్న జట్లకు ఆసియా జట్లు దిమ్మతిరిగే షాక్‌లు ఇస్తున్నాయి. అర్జెంటీనాపై సౌదీఅరేబియా సంచలన విజయంతో మొదలైన పరంపర..కొనసాగుతున్నది. జర్మనీపై జపాన్, దక్షిణకొరియా, ఉరుగ్వే మ్యాచ్ డ్రా, తాజాగా వేల్స్‌పై ఇరాన్ విజయం. శుక్రవారం జరిగిన గ్రూపు-బి మ్యాచ్‌లో ఇరాన్ 2-0తో వేల్స్‌పై విజయం సాధించింది. వరుస టోర్నీల్లో పోటీకి దిగుతున్న ఇరాన్ ఇప్పటి వరకు నాకౌట్‌కు అర్హత సాధించలేకపోయింది. నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఇరాన్ తరఫున రుజ్బె చెశ్మి (90+8ని), రామిన్ రిజియాన్(90+11ని) సూపర్ గోల్స్ చేశారు.
ర్యాంకింగ్స్ పరంగా వేల్స్(19), ఇరాన్(20) దాదాపు సమవుజ్జీలుగా ఉన్నాయి. తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో భారీ ఓటమి(2-6) ఎదుర్కొన్న ఇరాన్ పుంజుకున్న తీరు వారెవ్వా అనిపించింది. మరోవైపు అమెరికాతో తొలి మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న వేల్స్..తమ నాకౌట్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. మ్యాచ్ విషయానికొస్తే ఇరు జట్లు గోల్ కోసం కడదాకా ప్రయత్నించాయి. అయితే మ్యాచ్ అదనపు సమయంలో ఇరాన్ ఒక్కసారిగా పోటీలోకి వచ్చింది. వేల్స్ డిఫెన్స్‌ను కకావికలు చేస్తూ తొలుత చెశ్మి కండ్లు చెదిరే గోల్‌తో ఇరాన్‌కు గోల్ అందించాడు. అదే జోరు కనబరుస్తూ రామిన్ మరో గోల్ కొట్టడంతో ఇరాన్ గెలుపు సంబురాల్లో మునిగిపోయింది. అనూహ్య ఓటమి ఎదుర్కొన్న వేల్స్ ప్లేయర్లు నిశ్చేష్టులై ఉండిపోయారు.
వాహ్ రిచర్లీసన్:
మెగాటోర్నీని బ్రెజిల్ తమదైన శైలిలో షురూ చేసింది. సెర్బియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో సాంబా జట్టు స్థాయికి తగ్గ ఆటతీరుతో ఆకట్టుకుంది. ప్రథమార్ధంలో సెర్బియా నుంచి పోటీ ఎదురైనా.. మలి భాగంలో బ్రెజిల్ అద్భుతంగా పుంజుకుంది. స్టార్ స్ట్రైకర్ నెయ్మర్ గాయం కారణంగా అర్ధాంతరంగా వైదొలుగగా, తొలి ప్రపంచకప్ ఆడుతున్న రిచర్లీసన్ దాడులను ముందుం డి నడిపించాడు. మ్యాచ్ 62వ నిమిషంలో రిచర్లీసన్ కొట్టిన గోల్ టోర్నీకే హైలెట్‌గా నిలిచేలా ఉంది. సహచరున్నుంచి బంతి అందుకున్న ఈ యువ ప్లేయర్.. స్పిన్నింగ్ కిక్‌తో సూపర్ గోల్ కొట్టాడు. సెర్బియా డిఫెన్స్‌ను చెదరగొడుతూ రిచర్లీసన్ గోల్ కొట్టడంతో బ్రెజిల్ సంబురాల్లో మునిగిపోయింది. అదే జోరులో పది నిమిషాల తేడాతో మరో గోల్ చేయడంతో బ్రెజిల్ విజయం ఖరారైంది.
ఖతార్ ఔట్!
మెగాటోర్నీ నుంచి ఆతిథ్య ఖతార్ దాదాపు నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన పోరులో ఖతార్ 1-3తో సెనెగల్ చేతిలో ఓడింది. దీంతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో ఖతార్ 0 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. తమ ఆఖరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో ఖతార్ తలపడుతుంది.