చెన్నై: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్ల మధ్య ఎల్‌క్లాసికో పోరులో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి పైచేయి సాధించింది. వాంఖడేలో ఆ జట్టును చిత్తుగా ఓడించిన సీఎస్కే ఈసారి తమ సొంతగడ్డ చెపాక్‌లోనూ చెక్ పెట్టి కీలక విజయం అందుకుంది. మరోవైపు ఈ సీజన్లో చెత్తాటతో నిరాశపరుస్తున్న ముంబై ఏడో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో చెన్నై చేతిలో చిత్తయింది. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమన్ ధీర్ (37బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్సర్లతో 57) అర్థ శతకంతో సత్తాచాటగా.. ర్యాన్ రికెల్టన్ (24బంతుల్లో 5 సిక్సర్లతో 37)రాణించాడు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్(3/32), నూర్ అహ్మద్ (2/26) మెప్పించారు. తర్వాత రుతురాజ్ గైక్వాడ్ (48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 67నాటౌట్),కార్తీక్ శర్మ (40 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లతో 54నాటౌట్) అర్ధ శతకాలతో విజృంభించడంతో సీఎస్కే18.1 ఓవర్లలోనే 160/2 స్కోరు చేసి సులువుగా గెలిచింది. రుతురాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆట చప్పగా సాగింది. సీఎస్కేబౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో తక్కువ స్కోరుకే పరిమితం అయింది. నమన్ ధీర్ ఒక్కడే దీటుగా ఆడగలిగాడు. తొలి ఓవర్లో ముకేష్ ఒకే పరుగుతో చెన్నై బౌలింగ్ దాడిని ప్రారంభిస్తే.. తన రెండో బంతికే ఓపెనర్ విల్‌జాక్స్ (1)ను ఔట్ చేసిన అన్షుల్ ముంబైకి షాకిచ్చాడు. ముకేశ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లతో దూకుడు చూపెట్టిన రికెల్టన్ ప్రశాంత్ వీర్ వేసిన ఐదో ఓవర్లో మూడు సిక్సర్లతో హోరెత్తించాడు. వన్‌డౌన్ బ్యాటర్ నమన్ కూడా ధాటిగా ఆడటంతో పవర్ ప్లేను ముంబై 57/1తో ముగిచింది. కానీ, ఆరో ఓవర్లో రికెల్టన్ను పెవిలియన్ చేర్చిన నూర్ రెండో వికెట్‌కు 58 పరుగుల భాగసామ్యాన్ని ముగించాడు. ఈ దశలో నమన్‌కు తోడైన సూర్యకుమార్ (21) నూర్ బౌలింగ్‌లోనే 4,6తో వేగం పెంచడంతో 10 ఓవర్లకు 90/2తో నిలిచిన ముంబై మంచి స్కోరు చేసేలా కనిపించింది. ఇక్కడి నుంచి చెన్నై బౌలర్లు జోరు పెంచారు. 12వ ఓవర్లో బ్రెవిస్ పట్టిన క్యాచ్‌తో సూర్యను రామకృష్ణ డగౌట్‌కు పంపితే.. తిలక్ వర్మ (5)ను నూర్ ఔట్ చేశాడు. స్లాగ్ ఓవర్లలో సీఎస్కే కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రన్‌రేట్ పడిపోయింది. కెప్టెన్ హార్దిక్ (18)వేగంగా ఆడలేకపోయాడు. మరోవైపు ఒంటరిపోరాటం చేస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న నమన్ ఓవర్టన్ బౌలింగ్‌లో సిక్స్‌తో మళ్లీ వేగం పెంచే ప్రయత్నం చేశాడు. తర్వాతి బంతికే ఇంకో షాట్ ఆడబోయి క్యాచ్ ఔటయ్యాడు. రాబిన్ బింజ్ (5) నిరాశపరచగా.. చివరి ఓవర్లో హార్దిక్ ఫోర్, ట్రెంట్ బౌల్ట్ (7నాటౌట్) సిక్స్ కొట్టడంతో ముంబై స్కోరు 150 మార్కు దాటింది.
చిన్న లక్ష్యాన్ని చెన్నై సులువుగా అందుకుంది. రెండో ఓవర్లోనే స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ (11)ను బుమ్రా ఔట్ చేసినా..ఆతిథ్య జట్టు తడబడలేదు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గెలుపు బాధ్యత తీసుకోగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఉర్విల్ పటేల్ (24) ఉన్నంతసేపు మంచి సహకారం అందించాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో గైక్వాడ్ 4,4,6తో అలరిస్తే.. ఐదో ఓవర్లో అరంగేట్రమ్ పేసర్ క్రిష్ భగత్‌కు ఉర్విల్ 6,4,6తో స్వాగతం పలికాడు. అదే జోరుతో మరో సిక్స్ కొట్టిన ఉర్విల్‌ను ఘజన్ఫర్ క్యారమ్ బాల్‌తో బౌల్డ్ చేసి ముంబైని రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, ఇంపాక్ట్ ప్లేయర్ కార్తీక్ శర్మతోడుగా కెప్టెన్ రుతురాజ్ లక్ష్యాన్ని కరిగించ సాగాడు. ఘజన్ఫర్ బౌలింగ్‌లో సిక్సర్ల ఖాతా తెరిచిన కార్తీక్ ..హార్దిక్ వేసిన 11వ ఓవర్లో లాంగాన్ మీదుగా మరో సిక్స్ కొట్టి స్కోరు వంద దాటించాడు. అదే జోరు కొనసాగిస్తూ గైక్వాడ్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకోగా..చివర్లో భారీ షాట్లతో విరుచుకుపడిన కార్తీక్ ఐపీఎల్లో తొలి అర్ధశతకం పూర్తి చేసుకొని విన్నింగ్ ఫోర్ కొట్టాడు.
ముంబై: 20 ఓవర్లలో 159/7 (నమన్ ధీర్ 57, రికెల్టన్ 37, అన్షుల్ కంబోజ్ 3/32, నూర్ అహ్మద్ 2/26)
చెన్నై: 18.1 ఓవర్లలో 160/2 (రుతురాజ్ 67*, కార్తీక్ 54*, ఘజన్ఫర్ 1/40)