ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ ఆశలు అడిఆశలయయ్యాయి. లీగ్‌లో పడుతూ లేస్తూ సాగుతున్న క్యాపిటల్స్ ప్రస్థానం నిరాశగా ముగియనుంది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఏడు ఓటములు చవిచూసిన ఢిల్లీ లీగ్ నుంచి దాదాపుగా నిష్క్రమించగా, నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ మరోమారు ప్లేఆఫ్ బెర్తుకు మరింత చేరువ అయ్యింది. సొంతగడ్డపై సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన చెన్నై.. ఢిల్లీని కట్టడి చేస్తూ టాప్-2లో కొనసాగుతున్నది.
చెన్నై: లీగ్ సాగుతున్నా కొద్ది చెన్నై సూపర్‌కింగ్స్ తమ ఆటకు మరింత పదును పెడుతున్నది. బుధవారం చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై 27 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. తమ వరుస విజయాలకు కొనసాగింపుగా ఢిల్లీని చెన్నై చిత్తు చేసింది. మరోవైపు వరుస విజయాలతో ఒకింత గాడిలో పడినట్లు కనిపించిన క్యాపిటల్స్ ఆటలు చెన్నై ముందు సాగలేదు. ఫలితంగా మరో మూడు మ్యాచ్‌లు మిగిలుండగానే ప్లేఆఫ్స్ బెర్తు నుంచి అనధికారికంగా నిష్క్రమించింది.
తొలుత శివమ్ దూబే(25), గైక్వాడ్(24)రాణించడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 167/8 స్కోరు చేసింది. మిచెల్ మార్ష్(3/18) మూడు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్(2/27) రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. లక్ష్యఛేదనలో ఢిల్లీ 140/8 స్కోరుకు పరిమితమైంది. మతీషా పతిరన(3/37), దీపక్ చాహర్(2/28) ధాటికి ఢిల్లీ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. రిలీ రొసో(35) టాప్ స్కోరర్‌గా నిలువగా, మంచి ఫామ్‌మీదున్న కెప్టెన్ వార్నర్(0) డకౌట్‌గా వెనుదిరుగడం ఢిల్లీ గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. దీనికి తోడు చెన్నై ఫీల్డింగ్ ఢిల్లీని ఓటమి వైపు నిలిపింది. జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 167/8(దూబే 25, రుతురాజ్ 24, మార్ష్ 3/18, అక్షర్ పటేల్ 2/27),
ఢిల్లీ: 20 ఓవర్లలో 140/8(రొసో 35, మనీశ్ పాండే 27, పతిరన 3/37, చాహర్ 2/28)