ఈ సీజన్లో పడుతూ లేస్తూ సాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే).. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక రాణించాల్సిన మ్యాచ్‌లో జూలు విదిల్చింది. తమ సొంత డెన్ చెపాక్‌లో సిమర్జిత్ సూపర్ బౌలింగ్‌తో రాజస్థాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడిచేసిన రుతురాజ్ సేన.. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడ్డా చివరికి గమ్యాన్ని ముద్దాడింది. ఈ గెలుపుతో చెన్నై.. ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది.
చెన్నై: ఐపీఎల్-17లో ఒడిదొడుకుల మధ్య సాగుతున్న డిఫెండింగ్ చాంపియన్ సూపర్ కింగ్స్.. ప్లేఆఫ్స్ రేసులో నిలిచేందుకు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన అత్యంత కీలకమ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. చెపాక్ వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ప్లేఆఫ్స్ బెర్తును పదిలం చేసుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సిమర్జిత్ సింగ్ (3/26) ధాటికి రాజస్థాన్ టాపార్డర్ కుప్పకూలడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులకే పరిమితమైంది. రియాన్ పరాగ్ (35 బంతుల్లో 47 నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. స్వల్ప ఛేదనే అయినా చెన్నై కూడా ఛేదనలో తడబాటుకు లోనైంది. రుతురాజ్ గైక్వాడ్ (41 బంతుల్లో 42 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆ జట్టు 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తిచేసింది.
సిమర్జిత్ సూపర్..
చెపాక్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగానే ఆరంభించింది. ప్రమాదకర బట్లర్ (21), జైస్వాల్ (24) క్రీజులో ఉన్నా పవర్ ప్లేలో ఆ జట్టు 42 పరుగులే చేయగలిగింది. ఏడో ఓవర్లో బంతిని అందుకున్న సిమర్జిత్.. రెండో బంతికే జైస్వాల్‌ను ఔట్ చేసి చెన్నైకి బ్రేక్ ఇచ్చాడు. తన రెండో ఓవర్లో బట్లర్‌ను బోల్తా కొట్టించిన సిమర్జిత్.. 15వ ఓవర్లో శాంసన్ (15) ను పెవిలియన్‌కు పంపాడు. మిడిల్ ఓవర్స్‌లో రాజస్థాన్ బ్యాటర్లు పరుగులు తీయడానికి నానా తంటాలు పడ్డారు. తీక్షణ, జడేజా, శార్దూల్ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడిచేశారు. చివర్లో పరాగ్, ధ్రువ్ జురెల్ (18 బంతుల్లో 28, 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుపులతో రాజస్థాన్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
చెన్నై కష్టంగానే..
స్వల్ప ఛేదనను పూర్తిచేయడానికి చెన్నై కూడా తంటాలు పడింది. ఆరంభంలో రచిన్ రవీంద్ర (18 బంతుల్లో 27, 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడినా అశ్విన్ వేసిన 3వ ఓవర్లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మిచెల్ ఉన్నది కొద్దిసేపే అయినా బౌండరీలతో మెరుపులు మెరిపించి చాహల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత నుంచి సీఎస్కే స్కోరు వేగం మందగించింది. మోయిన్ అలీ (10)తో పాటు రుతురాజ్ కూడా పరుగులు తీయడానికి ఇబ్బందిపడ్డారు. అశ్విన్ వేసిన 14వ ఓవర్లో 6, 4, 4 బాదిన దూబే (18) అదే ఓవర్లో ఆఖరి బంతికి రియాన్ పరాగ్ చేతికి చిక్కాడు. జడేజా (5) అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ రూపంలో పెవిలియన్ చేరడంతో చెన్నై శిబిరంలో ఒకింత అలజడి రేగింది. కానీ రుతురాజ్ అండతో రిజ్వి (8 బంతుల్లో 15 నాటౌట్, 3 ఫోర్లు) లాంఛనాన్ని పూర్తిచేశాడు.
సంక్షిప్త స్కోర్లు
రాజస్థాన్: 20 ఓవర్లలో 141/5 (రియాన్ 47, జురెల్ 28, సిమర్జిత్ 3/26, తుషార్ 2/30). చెన్నై: 18.2 ఓవర్లలో 145/5 (రుతురాజ్ 42 నాటౌట్, రచిన్ 27, అశ్విన్ 2/35, బర్గర్ 1/21)