చాన్నాళ్ల తర్వాత చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన పోరులో ధోనీ సేన అదరగొట్టింది. అశేష అభిమాన గణం ముందు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేయగా.. అనంతరం బౌలింగ్‌లో మోయిన్ అలీ మ్యాజిక్ చేయడంతో ధోనీ సేన గెలుపు ‘విజిల్’ వేసింది.
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ ఆరంభం పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలైన చెన్నై సూపర్ కింగ్స్.. సొంతగడ్డపై జరిగిన పోరులో విశ్వరూపం కనబర్చింది. సోమవారం పోరులో చెన్నై 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసింది.
గత మ్యాచ్‌లో తృటిలో సెంచరీ చేజార్చుకున్న యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (31 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా.. కాన్వే (29 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), శివమ్ దూబే (27; ఒక ఫోర్, 3 సిక్సర్లు) అంబటి రాయుడు (27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. చివరి ఓవర్లో క్రీజులో అడుగుపెట్టిన కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ.. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను భారీ సిక్సర్లుగా మలిచి మైదానాన్ని హోరెత్తించాడు. లక్నో బౌలర్లలో మార్క్ వుడ్, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులకు పరిమితమైంది.
ఓపెనర్ కైల్ మయేర్స్ (22 బంతుల్లో 53; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చినా.. మిడిలార్డర్ విఫలమవడంతో లక్నో లక్ష్యానికి చేరువలో నిలిచిపోయింది. పూరన్ (32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా అప్పటికే ఆలస్యమైపోయింది. చెన్నై బౌలర్లలో మోయిన్ అలీ 4 వికెట్లు పడగొట్టాడు. అలీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా మంగళవారం ఢిల్లీతో గుజరాత్ తలపడనుంది.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 217/7 (రుతురాజ్ 57, కాన్వే 47; రవి బిష్ణోయ్ 3/28, మార్క్‌వుడ్ 3/49),
లక్నో: 205/7 (మయేర్స్ 53, పూరన్ 32; మోయిన్ అలీ 4/26, తుషార్ 2/45).