చెన్నై: ఐపీఎల్లో మాజీ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్కే) వరస విజయాల జోరు కొనసాగుతున్నది. లీగ్‌లో తొలుత తడబడ్డ చెన్నై ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో గాడిలో పడింది. మంగళవారం సొంతగడ్డపై జరిగిన పోరులో చెన్నై 32 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. దిగ్గజ మహేంద్రసింగ్ ధోనీ గైర్హాజరీలో బరిలోకి దిగిన చెన్నై సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలుత సంజూ శాంసన్ (32 బంతుల్లో 48, 4ఫోర్లు, 3సిక్స్‌లు), డెవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 41, 4ఫోర్లు, 2సిక్స్‌లు) రాణించడంతో చెన్నై 20 ఓవర్లలో 192/5 స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7) మరోమారు ఘోరంగా నిరాశపర్చగా, గత మ్యాచ్ సెంచరీ హీరో శాంసన్..చెన్నైకి పెద్దదిక్కుగా మారాడు. ఆయూశ్ మాత్రె (17 బంతుల్లో 38, 6ఫోర్లు, 2సిక్స్‌లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. సీఎస్కే బ్యాటర్లకు మూకుతాడు వేస్తూ కోల్‌కతా స్పిన్నర్లు సునీల్ నరైన్ (1/21), అనుకూల్ రాయ్ (1/21), వరుణ్ చక్రవర్తి (3-0-26-0) పొదుపు పాటించారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 160/7 స్కోరు చేసింది. రమణ్‌దీప్‌సింగ్(35), రోవ్‌మన్ పావెల్(31 నాటౌట్) టాప్‌స్కోరర్‌గా నిలువగా, మిగతావారు బ్యాట్లు ఝులిపించడంలో విఫలమై స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. నూర్ అహ్మద్ (3/21), కంబోజ్ (2/26) ధాటికి కోల్‌కతా ఘోరంగా కుదేలైంది. దీంతో ఈ సీజన్లో ఐదు మ్యాచ్‌లాడిన కోల్‌కతా నాలుగింటిలో ఓడి కనీసం బోణీ కొట్టలేకపోగా, చెన్నై వరుసగా రెండో విజయంతో ఆకట్టుకుంది.
శాంసన్, బ్రెవిస్ రాణించగా : తొలుత టాస్ గెలిచిన కోల్‌కతా..చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. లీగ్‌లో విజయమెరుగని కోల్‌కతా అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో విఫలమవుతూనే ఉన్నది. ఇప్పటికీ సరైన కాంబినేషన్ లేక చేజేతులా మ్యాచ్‌లను వదులుకుంటున్నది. చెన్నైతో మ్యాచ్‌లోనూ అదే సీన్ పునరావృతం అయ్యింది. కెప్టెన్ రుతురాజ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశామనుకున్న కోల్‌కతాకు శాంసన్, మాత్రె రూపంలో ప్రతిఘటన ఎదురైంది. లీగ్‌లో సెంచరీతో ఫామ్ అందుకున్న శాంసన్..మాత్రె జతగా కీలక ఇన్నింగ్స్‌కు తెరతీశాడు. వైభవ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ మూడు బంతులను శాంసన్ వరుసగా బౌండరీలు కొట్టి తన ఫామ్‌ను చాటుకున్నాడు. మరో ఎండ్‌లో మాత్రె..శాంసన్‌ను అనుసరించాడు. గ్రీన్ నాలుగో ఓవర్లో మాత్రె రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 21 పరుగులు పిండుకున్నాడు. అదే జోరు కొనసాగిస్తూ ఆరోరా ఆరో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగిన మాత్రె..రమణ్దీప్సింగ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇన్నింగ్స్ కుదురుకుంటున్న తరుణంలో శాంసన్ కూడా ఔట్ కావడంతో ఒత్తిడిలోకి వెళ్లిన చెన్నైని బ్రెవిస్ ఆదుకున్నాడు. సర్ఫరాజ్‌ఖాన్(23)తో కలిసి బ్రెవిస్ బౌండరీలతో చెలరేగాడు. మిడిల్ ఓవర్లలో కోల్‌కతా స్పిన్నర్లు కట్టుదిట్టం చేయడంతో పరుగుల రాక ఒకింత మందగించింది. లేకపోతే చెన్నై భారీ స్కోరు అందుకునేది.
కోల్‌కతా ఢమాల్ : బౌలింగ్‌లో ఒకింత ఆకట్టుకున్న కోల్‌కతా బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ ఫిన్ అలెన్(1) సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితం కాగా, సునీల్ నరైన్(24), కెప్టెన్ రహానే(28), రఘువంశీ(27) క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. రింకూసింగ్(6), గ్రీన్(0) మరోమారు ఘోరంగా విఫలమయ్యారు. ఆఖర్లో రమణ్‌దీప్‌సింగ్(23 బంతుల్లో 35, 4ఫోర్లు, సిక్స్), పావెల్(22 బంతుల్లో 31 నాటౌట్, ఫోర్, రెండు సిక్స్‌లు) చెలరేగినా సాధించాల్సిన లక్ష్యం పెద్దగా ఉండటంతో గెలుపు సాధ్యం కాలేదు.

చెన్నై: 20 ఓవర్లలో 192/5(శాంసన్ 48, బ్రెవిస్ 41, త్యాగి 2/35, నరైన్ 1/21),
కోల్‌కతా: 20 ఓవర్లలో 160/7(రమణ్‌దీప్ 35, పావెల్ 31 నాటౌట్, నూర్ 3/21, కంబోజ్ 2/32)