ఐపీఎల్లో 5 సార్లు చాంపియన్.. 10 సార్లు ఫైనలిస్టులు.. అంతర్జాతీయ స్థాయి దిగ్గజాల ప్రాతినిధ్యం.. కెప్టెన్ కూల్ సారథ్యం.. అనామక ఆటగాళ్లతో చరిత్ర సృష్టించిన ఘనత.. సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం.. ఇన్ని ఉన్నా ఐపీఎల్లో గత ఆరేడేండ్లుగా చెన్నైని ఓ బలహీనత దారుణంగా వేధిస్తున్నది. ప్రత్యర్థి జట్టు తమ ఎదుట 180+ టార్గెట్ నిర్దేశించిందా? అంతే.. ఖేల్ ఖతం.. సీఎస్కే ఓటమి ఖరారైనట్టే!
Chennai Super Kings | నమస్తే తెలంగాణ క్రీడా విభాగం; కదనరంగంలో మన బలాలను తెలుసుకోవడాని కంటే ముందు ప్రత్యర్థి బలహీనతలను గుర్తించడం ఎంతో కీలకం. తద్వారా వారిపై ఎలా దాడి చేయాలి? వారిని ఎలా ఓడించాలనే వ్యూహరచనలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో ఆడేప్పుడు ప్రత్యర్థి జట్లు ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. ఈ లీగ్‌లో మరే జట్టుకూ లేని ఘనమైన ఘనతలను కలిగిన సీఎస్కేతో మ్యాచ్ ఆడుతూ.. మొదట బ్యాటింగ్ చేసి చెన్నై ముందు 180+ టార్గెట్ నిర్దేశిస్తే చాలు. ఆ జట్టుకు విజయం గ్యారెంటీ! గణాంకాలు చెబుతున్న కఠోర వాస్తవాలివి. రెండ్రోజుల క్రితం పంజాబ్ కింగ్స్‌తో ముల్లాన్‌పూర్ వేదికగా ఎదురైన ఓటమితో కలుపుకుని.. చెన్నై వరుసగా 11 అపజయాలను తమ ఖాతాలో వేసుకుంది.
ఏడేండ్ల నుంచీ ఇదే కథ..
ఐపీఎల్లో చెన్నై ఆఖరిసారిగా 2018లో 180+ టార్గెట్‌ను ఛేదించింది. ఆ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లీగ్, ప్లేఆఫ్స్లలో జరిగిన మ్యాచ్‌లలో సీఎస్కే.. 180 పరుగుల ఛేదనను రెండు సార్లు చేసింది. నాటి నుంచి మొన్నటి పంజాబ్‌తో మ్యాచ్ దాకా చెన్నై 11 సార్లు 180+ టార్గెట్ ఛేదించాల్సి వచ్చినా ఆ జట్టుకు పరాభవాలే ఎదురయ్యాయి. ఈ క్రమంలో 2025 సీజన్లోనే రుతురాజ్ సేన మూడు ఓటములు మూటగట్టుకుంది. బెంగళూరుతో మ్యాచ్‌లో ఆ జట్టు నిర్దేశించిన 197 పరుగుల ఛేదనలో చెన్నై.. 146/8 వద్దే ఆగిపోయింది. ఢిల్లీ 184 టార్గెట్‌ను నిర్దేశిస్తే 158/5తోనే సరిపెట్టుకుంది. పంజాబ్‌తోనూ పోరులోనూ ఇదే రిపీట్ అయింది. పంజాబ్‌తో పోరును మినహాయిస్తే.. బెంగళూరు, ఢిల్లీతో సొంతగడ్డపై చెన్నైకి ఘనమైన రికార్డు ఉండేది. చెపాక్‌లో 2010 నుంచి ఆర్సీబీ, ఢిల్లీ చేతిలో ఓటములు ఎరుగని చెన్నైకి ఈ సీజన్లో పరాభవాలు తప్పలేదు. ఛేదనలో టాపార్డర్ వైఫల్యంతో ఆరంభంలోనే తడబడుతున్న రుతురాజ్ సేన.. మధ్య ఓవర్లలో మరీ దారుణంగా 6, 7 నెట్ రన్ రేట్‌ను కూడా నమోదు చేయలేకపోతున్నది. ఇదే ఆ జట్టు కొంప ముంచుతున్నది. తమను భయపెడుతున్న గండాన్ని దాటే క్రమంలో చెన్నై టాప్-3 బ్యాటర్ల స్ట్రైక్ రేట్ 120.74 కాగా సగటు 17.86 మాత్రమే.
రైనా నిష్క్రమణ తర్వాత ఢీలా..
2018కు ముందు సురేశ్ రైనా వంటి హిట్టర్లు ఆ జట్టులో ఉండగా 180+ టార్గెట్‌ను చెన్నై 9 సార్లు ఛేదించింది. తనదైన దూకుడుతో రైనా.. లక్ష్యాలను రాకెట్ స్పీడ్‌తో కరిగించేవాడు. రైనా వీడ్కోలు తర్వాత ఇదే టార్గెట్‌ను ఛేదిస్తూ చెన్నై ఒక్క మ్యాచ్‌లో కూడా నెగ్గలేదంటే అతడి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. దూబే వంటి ఆటగాడిని ఏరికోరి తెచ్చుకున్నా అతడు మెరుపులు మెరిపించిన సందర్భాలు స్వల్పం కాగా ఛేదనలో అయితే ఎప్పుడెప్పుడు పెవిలియన్ చేరుతాడా? అన్నట్టు ఆడుతున్నాడు. ఇక ప్రస్తుత, మాజీ సారథులు (రుతురాజ్, ధోనీ) ఆట కూడా ఘోరంగా ఉంది. ఆ 11 మ్యాచ్‌లలో రుతురాజ్ నాలుగుసార్లు డకౌట్ అయి 4 పర్యాయాలు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. అత్యధిక స్కోరు 63 (మొత్తంగా చేసినవి 148 రన్స్). ఇన్నింగ్స్ ఆఖర్లో బ్యాటింగ్‌కు వస్తున్న ధోనీ సైతం గతంలో మాదిరిగా బ్యాట్ ఝుళిపించలేకపోతున్నాడు. 2023 సీజన్ నుంచి చెన్నై విజయాల్లో ధోనీ ప్రభావం (20.23 శాతం) చాలా తక్కువ. ఈ క్రమంలో అతడి సగటు 13.80గా నమోదైంది. అదే సమయంలో ఓడిన మ్యాచ్‌లలో 14 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు వచ్చి చేసింది 272 పరుగులే. చెన్నై బలహీనతను సొమ్ముచేసుకుంటున్న ప్రత్యర్థి జట్లు.. తమకు మొదట బ్యాటింగ్ చేసే అవకాశమొచ్చినా ఎగిరి గంతేస్తున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే పాయింట్లపట్టికలో ఇప్పటికే 9వ స్థానంలో కొనసాగుతున్న సీఎస్కే మరోసారి లీగ్ దశకు పరిమితమైనా ఆశ్చర్యపడనక్కర్లేదు.