Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరుగనున్నది. ఇప్పటికే ఐసీసీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. పాక్‌కు టీమిండియాను పంపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఐసీసీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ఒప్పించింది. పాక్ డిమాండ్‌కు సైతం బీసీసీఐ ఒకే చెప్పింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆడబోయే మ్యాచులన్నీ దుబాయిలో జరుగనున్నట్లు తెలుస్తున్నది. రోహిత్ నేతృత్వంలోని టీమిండియా సెమీ-ఫైనల్, ఫైనల్స్‌కు అర్హత సాధించినా యూఏఈ వేదికగానే అన్ని మ్యాచులు జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, యూఏఈ కౌంటర్ షేక్ నహ్యాన్ అల్ ముబారక్ మధ్య జరిగిన సమావేశం తర్వాత దుబాయిని తటస్థ వేదికగా ఎంచుకున్నట్లు పీసీబీ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.
భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగే అన్ని మ్యాచ్‌లు తటస్థ వేదికలపైనే జరుగుతాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండు జట్లు ఏ ఐసీసీ టోర్నమెంట్ జరిగినా.. ఒక దేశంలో మరో దేశం పర్యటించేందుకు అవకాశం లేదు. రెండు జట్ల మధ్య మ్యాచులన్నీ తటస్థ వేదికల్లో మాత్రమే జరుగుతాయి. ఈ నిబంధన 2024-2027 వరకు అమల్లో ఉంటుంది. ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఇంకా విడుదల చేయాల్సి ఉంది. త్వరలోనే టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఐసీసీ పేర్కొంది. ఈ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తలపడతాయి.