Champions Trophy | భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆ క్రేజే వేరు. టోర్నీ ఎక్కడ జరిగినా..? వేదిక ఏదైనా రెండు జట్లు తలపడుతున్నాయంటే స్టేడియాలు మాత్రం కిక్కిరిసిపోవాల్సిందే. గతంలో పలుసార్లు ఈ విషయం నిరూపితమైంది. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్న విషయం తెలిసిందే. ఇందులో ఇరుజట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్ – పాక్ మ్యాచ్ దుబాయి వేదికగా జరుగనుండగా.. అభిమానుల్లో క్రేజ్ తారాస్థాయికి చేరింది. మ్యాచ్ టికెట్ల బుకింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే అమ్ముడయ్యాయంటే.. ఎంత భారీ క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. టికెట్లు దొరికిన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతుండగా.. టికెట్లు దొరకని వారంతా నిరాశకు గురవుతున్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాక్ మధ్య గ్రూప్ దశ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనున్నది.
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచులన్నీ దుబాయిలోనే ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అభిమానుల్లో టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉన్నది. చాలా కేటగిరిల్లో టికెట్లు అమ్మడయ్యాయి. మ్యాచ్ టికెట్లు స్థానిక కాలమానం ప్రకారం.. సాయంత్రం 4 గంటలకు అంటే భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 5.30 గంటలకు టికెట్ల విక్రయాలు ప్రారంభం కాగా.. దుబాయి క్రికెట్ స్టేడియం జనరల్ స్టాండ్ టికెట్ 125 దిర్హామ్స్ (రూ.3వేలు) నుంచి ప్రారంభమైంది. దుబాయిలో జరిగే మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. మొత్తం 15 మ్యాచులు జరుగుతాయి. ఐసీసీ ఈవెంట్ కోసం మ్యాచులకు పాకిస్తాన్, దుబాయి ఆతిథ్యం ఇస్తాయి.
భారత జట్టు అన్ని గ్రూప్ దశ మ్యాచులు దుబాయిలోనే జరుగుతాయి. అయితే, మిగిలిన జట్ల మ్యాచులు పాకిస్తాన్లో మాత్రమే జరుగుతాయి. టోర్నమెంట్ 19 రోజుల పాటు కొనసాగుతుంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం ప్రారంభం కానుండగా.. రావల్పిండి, లాహోర్, కరాచీ స్టేడియాల్లో మ్యాచులు జరుగుతాయి. పాకిస్తాన్‌లోని ప్రతి మైదానంలో మూడు గ్రూప్ మ్యాచులు జరుగుతుతాయి. భారత్ ఆడే మూడు గ్రూప్ మ్యాచ్‌లు, మొదటి సెమీ ఫైనల్ మాత్రం దుబాయిలోనే ఉంటుంది. ఈ ఈవెంట్లో టీమిండియా ఫిబ్రవరి 20న తొలి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. 23న పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత వారం రోజులు జట్టు విశ్రాంతి తీసుకొని.. మార్చి 2న చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. టీమిండియా చివరిసారిగా 2013లో చాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో టీమిండియా తొలిసారిగా టైటిల్‌ను నెగ్గింది. 2002లో వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దవగా.. శ్రీలంక, భారత్‌ను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.