DPL | న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్)లో పరుగులు సునామీలా పోటెత్తాయి. బౌండరీలు చిన్నబోయేలా బ్యాటర్లు దుమ్మురేపారు. బౌలర్లను తుత్తునియలు చేస్తూ సౌత్‌ఢిల్లీ సూపర్‌స్టార్స్ బ్యాటర్లు ఆయూశ్ బదోని (55 బంతుల్లో 165, 8ఫోర్లు, 19 సిక్స్‌లు), ప్రియాంశ్ ఆర్య(50 బంతుల్లో 120, 10ఫోర్లు, 10 సిక్స్‌లు) ధనాధన్ సెంచరీలతో విజృంభించారు. లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో వీరిద్దరి సూపర్ సెంచరీలతో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌పై సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 308/5 భారీ స్కోరు నమోదు చేసి 112 పరుగులతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఓవరాల్‌గా టీ20 క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యుత్తమ స్కోరుగా రికార్డుల్లోకెక్కింది. టీ20ల్లో మంగోలియాపై నేపాల్ 314/3 స్కోరు అగ్రస్థానంలో ఉంది. మ్యాచ్ విషయానికొస్తే..ప్రియాంశ్ ఆర్య, ఆయూశ్ బదోని ఆకాశమే హద్దుగా చెలరేగారు. బదోని ఏకంగా 19 సిక్స్‌లతో చెలరేగితే తానేం తక్కువ కాదన్నట్లు ఆర్య 50 బంతుల్లోనే 120 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో మనన్ భరద్వాజ్ వేసిన 12వ ఓవర్లో ఆర్య ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. దీంతో రెండో వికెట్‌కు వీరిద్దరు కలిసి 286 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీ20ల్లో ఏ వికెట్‌కైనా ఇది అత్యుత్తమ పార్ట్నర్షిప్. భారీ లక్ష్యఛేదనకు దిగిన నార్త్ఢిల్లీ 20 ఓవర్లలో 196/8 స్కోరుకు పరిమితమైంది. ప్రయాంశు(62) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. రాఘవ్సింగ్(3/34) మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.