పారిస్: తన కెరీర్లో తొలిసారి ఒలింపిక్స్ ఆడుతున్న స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కారజ్ మొదటి ప్రయత్నంలోనే పతకం ఖాయం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో అల్కారజ్ 6-1, 6-1తో ఫెలిక్స్ అగర్ అలిఅస్సిమె (కెనడా)ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. నాలుగేండ్ల తన స్వల్ప కెరీర్లో ఇదివరకే నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన ఈ స్పెయిన్ కుర్రాడు ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. రెండో సెమీస్‌లో జొకొవిచ్ (సెర్బియా), ముసెట్టి (ఇటలీ) మధ్య మ్యాచ్‌లో గెలిచిన ప్లేయర్‌తో అతడు అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ పోలండ్ అమ్మాయి ఇగా స్వియాటెక్‌కు కాంస్యం దక్కింది. కాంస్య పోరులో స్వియాటెక్ 6-2, 6-1తో అన్నా కరోలినా (స్లోవేకియా)ను ఓడించింది. శనివారం జరిగే ఫైనల్లో కిన్వెన్ జెంగ్ (చైనా), డొన వెకిచ్ (క్రొయేషియా) తలపడనున్నారు.