Carlos Alcaraz : పురుషుల టెన్నిస్‌లో కొత్త యోధుడిగా అవతరించిన కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల వేట కొనసాగిస్తున్నాడు. నిరుడు వింబుల్డన్ ట్రోఫీతో చరిత్ర సృష్టించిన ఈ స్పెయిన్ కెరటం ఫ్రెంచ్ ఓపెన్(French Open) చాంపియన్‌గా నిలిచాడు. మట్టి కోర్టులో తన అపూర్వ విజయాన్ని అందమైన జ్ఞాపకంగా మలుచుకోనున్నాడు.
రొలాండ్ గరోస్లో ట్రోఫీ గెలిచిన సందర్భానికి గుర్తుగా.. ప్యారిస్‌లోని ప్రతిష్ఠాత్మక కట్టడం ఈఫిల్ టవర్(Eiffel Tower)ను పచ్చబొట్టుగా వేసుకోనున్నాడు. తన ఎడమ చేతిపై ఈఫిల్ టవర్ టాట్టూ వేయించుకోవాలని అతడు భావిస్తున్నాడు.
Two weeks of competition coming down to these Extraordinary Moments with Haier for our champions 🤩 #RolandGarros @HaierOfficial pic.twitter.com/5oL0zOOsxY
— Roland-Garros (@rolandgarros) June 10, 2024
గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ విజయానంతరం టాట్టూ వేయించుకోవడం అల్కారాజ్‌కు కొత్తేమి కాదు. గత ఏడాది జకోవిచ్‌ను ఓడించి వింబుల్డన్ టైటిల్ నెగ్గినప్పుడు సైతం అతడు టాట్టూ వేయించుకున్నాడు. అతడి కుడిచేతిమీద ఇప్పటికీ వింబుల్డన్ ట్రోఫీ టాటూ అలాగే ఉంది. ఇప్పుడు ఎడమ చేతిపై ఈఫిల్ టవర్ పచ్చబొట్టుగా ప్రత్యక్షం కానుంది.
✨ Moments after the moment ✨#RolandGarros pic.twitter.com/AQEmg0DRp0
— Roland-Garros (@rolandgarros) June 10, 2024
ఆదివారం జరిగిన ఫైనల్లో అల్కరాజ్ దుమ్మురేపాడు. హోరాహోరీగా సాగిన ఐదు సెట్ల పోరులో అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై అద్బుత విజయం సాధించాడు. 6-2, 2-6, 5-7, 6-1, 6-2తో ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ గెలవాలనుకున్న తన చిన్నప్పటి కలను నిజం చేసుకున్నాడు. 21 ఏండ్ల వయసున్న అల్కరాజ్ ఇప్పటికే మూడు గ్రాండ్‌స్లామ్స్ గెలిచాడు.