రాయపోల్, జనవరి 6 : సిద్ధిపేట, మెదక్, మేడ్చెల్ జిల్లాల్లో12 వరుస కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నామని గజ్వేల్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నర్సింహులు తెలిపారు. మంగళవారం మండల కేంద్రం రాయపోల్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాపర్ వైర్ దొంగిలిస్తున్న ముఠాలోని ఏడుగురిని అరెస్ట్ చేశామని ఆయన వెల్లడించారు.
సిద్ధిపేట జిల్లా పరిధిలోని కుకునూర్‌పల్లి పోలీస్ స్టేషన్లో (4), రాయపోల్ పోలీస్ స్టేషన్లో (4), తొగుట పోలీస్ స్టేషన్లో (2).. మొత్తం 10 కేసులు, మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్లో 1 కేసు, మేడ్చెల్ జిల్లా షామీర్పేట పోలీస్ స్టేషన్లో 1 కేసు నమోదైనట్లు నర్సింహులు వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితులు పిట్ల ధనుష్ (20), విరణగర్, రాయ పోల్ మండలం, సత్తు వంశీ (22), గజ్వేల్, మొహమ్మద్ ఇర్ఫాన్ (19), రాంసాగర్ ,రాయపోల్. మండలం, దూదేకుల సల్మాన్ ఖాన్ (19), అక్కారం, గజ్వేల్ మండలం. ఓంక మహిపాల్ (21), వీరణగర్, రాయపోల్ మండలం కాగా, దొంగ సొత్తు కొనుగోలు చేసిన వారిగా మల్లేషం, మల్లప్ప, బీరప్పలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు చిల్లప్పను కర్నాటకవాసిగా గుర్తించారు.
కాపర్ వైర్ దొంగల వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
వ్యవసాయ భూముల్లోని బోర్ మోటార్ కేబుల్ వైర్లను రాత్రివేళ కటింగ్ ప్లెయర్లతో కట్ చేసి, నిర్మానుష్య ప్రాంతాల్లో కాల్చి.. కాపర్ వైర్‌ను వేరు చేసి స్క్రాప్ షాపులకు విక్రయించినట్లు విచారణలో తేలిందన్నారు. సిద్ధిపేట పోలీస్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్ కుమార్ పర్యవేక్షణలో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, తొగుట సీఐ ఎస్.కే.లతీఫ్, రాయపోల్ ఎస్సై మానస ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. అంకిరెడ్డిపల్లి గ్రామ శివారులోని గుర్రాలసోఫా వద్ద వాహన తనిఖీల్లో నిందితులను పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.70 వేల విలువ గల 90 కిలోల కాపర్ వైర్, మూడు ద్విచక్ర వాహనాలు (రూ.2,10,000/-) స్వాధీనం చేసుకున్నట్లు నర్సింహులు తెలిపారు. స్వాధీన సొత్తు విలువ రూ.2.80 లక్షలు ఉంటుందని డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నర్సింహులు చెప్పారు.