దండేపల్లి : అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా వయోజన విద్య (Adult education ) అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ (Vilayat Ali )
అన్నారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గ్రామంలో ఉల్లాస్ అక్షరాస్యత కేంద్రాలను జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, మండల ప్రత్యేక అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ లతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ అక్షరాలు దిద్ది చదువు నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని, 15 నుంచి 60 సంవత్సరాల లోపు వారందరూ చదువుకుంటే సమాజంలో గౌరవ స్థానం లభిస్తుందని అన్నారు. జిల్లా వయోజన విద్యాధికారి మాట్లాడుతూ ఉల్లాస్ అక్షరాస్యత కేంద్రాలకు నిరక్షరాస్యులు ప్రతి ఒక్కరు రావడమే కాకుండా చదువు నేర్చుకుని 100 రోజుల్లో అక్షరాస్యులుగా తయారు కావాలని తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.అనంతరం ఉల్లాస్ అక్షరాస్యత కేంద్రంలో చదువు నేర్చుకుంటున్న మహిళలు తమ అభిప్రాయాలను అధికారులకు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో సమన్వయకర్త, ప్రధానోపాధ్యాయుడు బొలిశెట్టి బుచ్చన్న, జిల్లా విద్యా క్వాలిటీ ఎడ్యుకేషన్ అధికారి సత్యనారాయణమూర్తి, ఎంఆర్పీ జనార్ధన్ తదితరులు ఉన్నారు.