Symptoms In Feet | మన శరీరం మొత్తం బరువు మన పాదాలపై పడుతుంది. మనం ప్రతిరోజూ చేసే శారీరక కార్యకలాపాల భారాన్ని మన పాదాలు మోస్తూ ఉంటాయి. మన శరీర భారాన్ని మోయడంతో పాటు మన శరీర ఆరోగ్యాన్ని కూడా మన పాదాలు తెలియజేస్తాయని వైద్యులు చెబుతున్నారు. చర్మం, గోర్లు మన శరీర ఆరోగ్యాన్ని ఏవిధంగా సూచిస్తాయో, మన పాదాలు కూడా మన ఆరోగ్యానికి సంబంధించిన సూచనలను అందిస్తాయని వారు చెబుతున్నారు. కొన్ని రకాల ఆరోగ్యసమస్యలు అంత త్వరగా బయటకు కనిపించవు కానీ వాటి సూచనలు, హెచ్చరికలు శరీరంలో కనబడుతూనే ఉంటాయి. కానీ మనం ఆ సూచనలను అర్థం చేసుకోలేక ఆ సమస్యలను గుర్తించలేక తీవ్ర అనారోగ్యానికి గురవుతూ ఉంటాం. శరీరంలో ఇతర భాగాల లాగా పాదాలు కూడా మన ఆరోగ్యాన్ని తెలియజేస్తాయి. పాదాలలో సంచలనం, నొప్పి, ఉష్ణోగ్రతలో మార్పు వంటివి కొన్ని రకాల అనారోగ్య సమస్యలను తెలియజేస్తాయి. అయితే ఇవి అన్ని సమయాల్లో అనారోగ్య సమస్యలే అని కూడా చెప్పలేమని వైద్యులు తెలియజేస్తున్నారు.
శరీరమంతా వెచ్చగా ఉన్నప్పటికీ పాదాలు నిరంతరం చల్లగా ఉంటాయి. ఇది మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడాన్ని సూచిస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం వల్ల శరీరంలో జీవక్రియ మందగిస్తుంది. దీంతో శరీరానికి ఉష్ణోగ్రతలను నియంత్రించే శక్తి తగ్గుతుంది. రక్తప్రసరణ సరిగ్గా ఉండదు. దీని వల్ల మన పాదాలు చల్లగా మారడం జరుగుతుంది. ఇటువంటి లక్షణాన్ని గుర్తించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి థైరాయిడ్ కు సంబంధించిన రక్తపరీక్షలు చేయించుకోవడం మంచిది. తరచూ పాదాల్లో తిమ్మిర్లు రావడం నరాల ఆరోగ్యం దెబ్బతినడాన్ని సూచిస్తుంది. విటమిన్ బి12 లోపం కారణంగా లేదా మధుమేహం కారణంగా ఇది జరుగుతుంది. తరచూ పాదాల్లో తిమ్మిర్లు, గుండు సూది పెట్టి గుచ్చినట్టు ఉండడం, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కనుక పాదాల్లో తరచూ ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
కండరాల తిమ్మిర్లు విటమిన్ బి12 లోపం వల్ల, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వల్ల, డిహైడ్రేషన్ కారణంగా లేదా నరాల సమస్యల వల్ల వస్తూ ఉంటాయి. బి12 లోపం నరాల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాగే ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, డిహైడ్రేషన్ కండరాల సంకోచానికి కారణమవుతాయి. కనుక ఈ లక్షణాన్ని గుర్తించిన వెంటనే తిమ్మిర్లకు గల కారణాన్ని తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి. నిరంతరం పాదాలల్లో వాపు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది గుండె వ్యాధులను, మూత్రపిండాల వ్యాధులను, కాలేయ వ్యాధులు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. ఈ అవయవాలన్నీ శరీరంలో ద్రవాల సమతుల్యాన్ని నియంత్రిస్తాయి. వాటి పనితీరు దెబ్బతినడం వల్ల ద్రవం ఎక్కువగా పేరుకుపోతుంది. గురుత్వాకర్షణ కారణంగా ఈ ద్రవం పాదాల్లోకి వెళ్తుంది. దీని వల్ల వాపు వస్తుంది. కనుక పాదాల్లో వాపును గమనించిన వెంటనే తక్షణం వైద్యున్ని సంప్రదించడం అవసరం.
విటమిన్ బి 12 లోపం, విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉండడం, శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల పాదాల్లో నొప్పులు రావచ్చు. విటమిన్ డి లోపం కారణంగా శరీరం క్యాల్షియంను గ్రహించదు. దీని వల్ల ఎముకలు బలహీనపడి నొప్పులు రావచ్చు. అలాగే కీళ్లల్లో యూరిక్ యాసిడ్ పేరుకుపోయి స్ఫటికాలుగా మారుతుంది. దీంతో పాదాల్లో వాపుతో పాటు నొప్పి కూడా ఉంటుంది. ఈ లక్షణాన్ని గుర్తించిన వెంటనే వైద్యున్నిసంప్రదించి నొప్పికి గల కారణాన్ని తెలసుకోవడం మంచిది. ఇలా పాదాలు కూడా మన శరీర ఆరోగ్యాన్ని, అంతర్లీనంగా ఉన్న ఆరోగ్య సమస్యలను ముందుగానే సూచిస్తాయని వైద్యులు చెబుతున్నారు. పాదాలు తెలియజేసే ఈ సూచనలను ముందుగానే గుర్తించి, వాటిని నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స తీసుకోవడం వల్ల మనం తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వారు తెలియజేస్తున్నారు.