న్యూయార్క్ : ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌లో యువ సంచలనం కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్)తో పాటు దిగ్గజ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్‌కు చేరారు. ఆర్థర్ ఆషే స్టేడియం వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో రెండో సీడ్ అల్కరాజ్.. 6-1, 6-0, 6-3తో మాటియా బెల్లూచి (ఇటలీ)పై అలవోక విజయం సాధించాడు. అల్కరాజ్ దూకుడు ముందు బెల్లూచి తేలిపోయాడు. తొలి గేమ్ నుంచే దూకుడు ప్రదర్శించిన నయా స్పెయిన్ బుల్.. 24 నిమిషాల్లోనే మొదటి సెట్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత కూడా పోరు ఏకపక్షంగానే సాగింది. ఎనిమిదో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌పై కన్నేసిన అతడు.. తదుపరి రౌండ్లో లుసియానొ దర్దెరితో తలపడనున్నాడు.
బుధవారం జరిగిన రెండో రౌండ్లో ఏడో సీడ్ జొకో.. 6-7 (5/7), 6-3, 6-3, 6-1తో అమెరికాకే చెందిన స్వజ్డను ఓడించాడు. 19 సారి యూఎస్ ఓపెన్ ఆడుతున్న జొకో.. ప్రతి సీజన్లోనూ మూడో రౌండ్ చేరడం గమనార్హం. తొలి సెట్ టైబ్రేకర్‌లో ఓడినా జొకో తర్వాత పుంజుకుని వరుస సెట్లను గెలుచుకున్నాడు. మిగిలిన మ్యాచ్‌లలో అమెరికా ఆటగాడు బెన్ షెల్టన్ 6-4, 6-2, 6-4తో పాబ్లొ కరెనొ (స్పెయిన్)ను మట్టికరిపించాడు. యూఎస్‌కే చెందిన ఫ్రాన్సిస్ టియాఫొ.. 6-4, 7-5, 6-7 (8/10), 7-5తో మార్టిన్ (అమెరికా)తో పోరాడి గెలిచి మూడో రౌండ్ చేరాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సబలెంకా.. 7-6 (7/4), 6-2తో పొలిన కుడర్మెటొవ (రష్యా)పై గెలిచింది. ఇటలీ అమ్మాయి జాస్మిన్ పౌలోని 6-3-, 6-3తో ఇవా జోవిక్ (అమెరికా)ను చిత్తు చేసి థర్డ్ రౌండ్ చేరింది. వీరితో పాటు మిర్రా ఆండ్రీవా, ఎలీనా రిబాకినా, జెస్సికా పెగులా, క్రెజికోవ మూడో రౌండ్‌కు ప్రవేశించారు.