మెల్బోర్న్: సుమారు మూడు వారాలుగా సాగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో శుక్రవారం సంచలనాలు నమోదయ్యాయి. నలుగురు అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ల మధ్య అత్యంత రసవత్తరంగా సాగిన సెమీస్ మ్యాచ్‌లు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టాయి. దాదాపు పదిగంటల పాటు (రెండు మ్యాచ్‌లు కలిపి) సాగిన పురుషుల సింగిల్స్ సెమీస్ పోరులో టాప్ సీడ్ కార్లొస్ అల్కరాజ్, సెర్బియా దిగ్గజ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ టైటిల్ పోరుకు అర్హత సాధించారు. శుక్రవారం రాడ్ లీవర్ ఎరీనా వేదికగా జరిగిన మొదటి సెమీస్‌లో అల్కరాజ్.. 6-4, 7-6 (7/5), 6-7 (3/7), 6-7 (4/7), 7-5తో మూడో సీడ్ జర్మనీ ఆటగాడు అలగ్జాండర్ జ్వెరెవ్‌పై పోరాడి గెలిచాడు. ఆస్ట్రేలియా ఓపెన్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగిన సెమీఫైనల్ (5 గంటల 27 నిమిషాలు)గా రికార్డులకెక్కిన మ్యాచ్‌లో 22 ఏండ్ల అల్కరాజ్.. అద్భుత పోరాటపటిమతో తన కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. తద్వారా కెరీర్ గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకోవాలన్న తన లక్ష్యానికి మరో అడుగు దూరంలో నిలిచాడు. ఇక రెండో సెమీస్‌లో నాలుగో సీడ్ జొకో.. 3-6, 6-3, 4-6, 6-4, 6-4తో రెండో సీడ్ యానిక్ సిన్నర్ (ఇటలీ)కు షాకిచ్చాడు. ఈ మ్యాచ్ కూడా 4 గంటల 9 నిమిషాల పాటు సాగగా ఐదు సెట్ల థ్రిల్లర్‌లో డిఫెండింగ్ చాంపియన్‌పై సెర్బియా దిగ్గజానిదే పైచేయి అయింది. జొకోకు ఇది 11వ ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ కాగా.. అతడు ఫైనల్ చేరిన ప్రతిసారీ విజేతగానే నిలవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జొకో, అల్కరాజ్ మధ్య ఆదివారం టైటిల్ పోరు రసవత్తర పోరు సాగనుండటం ఖాయం.
అల్కరాజ్, జ్వెరెవ్ మధ్య మారథాన్‌గా సాగిన తొలి సెమీస్ అభిమానులకు పైసా వసూల్ వినోదాన్ని, అంతకుమించిన ఉత్కంఠనూ అందించింది. పట్టు వదలని ఆటతో ఇరువురూ కోర్టులో నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. మొదటి రెండు సెట్లనూ గెలుచుకున్న అల్కరాజ్.. ఫైనల్‌కు ఒకే ఒక సెట్ విజయం దూరంలో నిలువగా అనూహ్యంగా జ్వెరెవ్ పుంజుకున్నాడు. అదే సమయంలో మూడో సెట్లో స్కోరు 5-4 వద్ద ఉండగా అల్కరాజ్ కుడి కాలు పట్టేయడంతో కోర్టులో అతడు నొప్పితో ఇబ్బందిపడ్డాడు. మెడికల్ టైమౌట్ తీసుకుని సెట్‌ను టైబ్రేకర్‌కు తీసుకెళ్లినా జ్వెరెవ్‌దే పైచేయి అయింది. మూడో సెట్ విజయంతో లయ అందుకున్న జ్వెరెవ్ నాలుగో సెట్‌నూ అదే ఊపులో సొంతం చేసుకోవడంతో మ్యాచ్ కాస్తా నిర్ణయాత్మక ఐదో సెట్‌కు దారితీసింది. ఆఖరి సెట్లో అల్కరాజ్ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగి 2-0 ఆధిక్యాన్ని సాధించాడు. ప్రత్యర్థిపై క్రమం తప్పకుండా ఒత్తిడి పెంచుతూ డ్రాప్ షాట్స్‌తో అతడిని బోల్తా కొట్టించాడు.
25వ గ్రాండ్‌స్లామ్ కోసం దాదాపుగా రెండేండ్లుగా ప్రయత్నిస్తూ.. అల్కరాజ్, సిన్నర్ల ధాటికి నిలువలేకపోతున్న జొకో ఈసారి మాత్రం వారిలో ఒకరి గండాన్ని అధిగమించాడు. సిన్నర్‌తో ఉత్కంఠగా సాగిన పోరులో అతడు తొలి, మూడో సెట్‌ను కోల్పోయినా తలవంచని పోరాటంతో హ్యాట్రిక్ టైటిల్ సాధించాలన్న సిన్నర్‌ను సెమీస్‌లోనే ఇంటికి పంపాడు. తద్వారా టెన్నిస్ ఓపెన్ ఎరాలో ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్స్ చేరిన అత్యంత పెద్ద వయస్కుడిగా 38 ఏండ్ల జొకో చరిత్ర సృష్టించాడు. సిన్నర్‌తో జరిగిన గత ఐదు మ్యాచుల్లో ఓడిన జొకోవిచ్.. సెమీస్‌లో మాత్రం ఆ తప్పులను పునరావృతం కాకుండా చూసుకోవడమే గాక 2024 వింబుల్డన్ తర్వాత గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లో తొలిసారి ఫైనల్ చేరాడు.