మెల్బోర్న్: తన కెరీర్లో తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ వేటలో ఉన్న స్పెయిన్ కుర్రాడు కార్లొస్ అల్కరాజ్ ఈ టోర్నీ మూడో రౌండ్‌కు చేరాడు. బుధవారం ఇక్కడ జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో అల్కరాజ్తో పాటు స్టార్ ప్లేయర్లు తదుపరి రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ అల్కరాజ్.. 7-6 (7/4), 6-3, 6-2తో జర్మనీకి చెందిన యానిక్ హన్ఫ్మన్ను ఓడించాడు.
తొలి సెట్లో కాస్త ప్రతిఘటించిన జర్మనీ ప్లేయర్.. తర్వాత రెండు సెట్స్‌లోనూ అదే పోరాటాన్ని కొనసాగించలేకపోయాడు. 78 నిమిషాల పాటు సాగిన తొలి సెట్లో 1-3తో వెనుకబడ్డ స్పెయిన్ కుర్రాడు.. సెట్‌ను టైబ్రేక్‌కు తీసుకెళ్లి ఆధిక్యం సాధించాడు.
మిగిలిన మ్యాచ్‌లలో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ).. 6-3, 4-6, 6-3, 6-4తో ముల్లర్ (ఫ్రాన్స్)ను ఓడించగా రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదెవ్ 6-7 (9/11), 6-3, 6-4, 6-2తో క్వింటిన్ హేల్స్ (ఫ్రాన్స్)ను చిత్తుచేశాడు. పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు యుకీ బాంబ్రీ, అండ్రె గొరన్సన్ (స్వీడన్) ద్వయం.. 6-3, 6-4తో జేమ్స్ డక్‌వర్త్, హెవిట్ (ఆస్ట్రేలియా) జోడిని ఓడించి రెండో రౌండ్‌కు చేరింది.
మహిళల సింగిల్స్ విషయానికొస్తే రెండో రౌండ్లో ఒకటో సీడ్ అరీనా సబలెంకా (బెలారస్).. 6-3, 6-1తో జోఉషువాన్ (చైనా)పై సునాయాస విజయం సాధించగా మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6-2, 6-2 ఒల్గా డేనిలోవిక్ (సెర్బియా)ను చిత్తుచేసింది. ఏడో సీడ్ జైస్మిన్ పౌలిని (ఇటలీ).. 6-2, 6-3తో మగ్డలెనా ఫ్రెచ్ (పోలండ్)పై నెగ్గగా 8వ సీడ్ మిర్రా ఆండ్రీవా (రష్యా) 6-0, 6-4తో మరియ సక్కారి (గ్రీక్)ను ఓడించింది.