Captains | ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన అనంతరం భారత క్రికెట్ అభిమానులు అంతర్జాతీయ సిరీస్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సమయంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు సంబంధించిన ఓ వార్త క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వరుస విజయాలతో భారత జట్టును అగ్రస్థానంలో నిలబెట్టిన సూర్యను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించే దిశగా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టు పగ్గాలు చేపట్టాడు. అతని నాయకత్వంలో భారత్ వరుసగా ఎనిమిది ద్వైపాక్షిక సిరీస్‌లను కైవసం చేసుకుంది. అంతేకాదు 2025 ఆసియా కప్‌తో పాటు 2026 టీ20 వరల్డ్‌కప్‌ను కూడా గెలుచుకుని ప్రపంచ క్రికెట్లో తన నాయకత్వ ప్రతిభను చాటుకున్నాడు.
వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలను అందించిన కెప్టెన్‌ను కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే మార్చాలనే ఆలోచన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఐసీసీ ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా కెప్టెన్సీ కోల్పోయిన భారత కెప్టెన్ల జాబితాలో రోహిత్ శర్మ పేరు ముందుంటుంది. విరాట్ కోహ్లీ తర్వాత 2021లో వన్డే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్, భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అతని నాయకత్వంలో భారత్ ఆసియా కప్‌లు గెలవడమే కాకుండా 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. అనంతరం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుని జట్టును మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు.వన్డే కెప్టెన్‌గా రోహిత్ అద్భుతమైన విజయశాతం నమోదు చేసినప్పటికీ, భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని సెలక్టర్లు నాయకత్వ బాధ్యతలను యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు.
2027 వరల్డ్‌కప్‌ను లక్ష్యంగా పెట్టుకుని తీసుకున్న నిర్ణయమిదేనని అప్పట్లో సెలక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ విషయంలోనూ సెలక్టర్లు ఇదే తరహా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో బీసీసీఐ ముందడుగు వేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఐపీఎల్లో అద్భుత కెప్టెన్సీ నైపుణ్యాన్ని ప్రదర్శించిన శ్రేయస్ అయ్యర్‌ను టీ20 జట్టు నాయకుడిగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్‌కు విజయాలను అందించి తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రోహిత్ శర్మ తర్వాత ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ విషయంలోనూ అదే ఫార్ములా అమలు చేస్తే, టీమిండియా భవిష్యత్తుపై దాని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.