గువాహటి: ఇటీవల కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి టెస్టులో మెడనొప్పితో మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన కెప్టెన్ శుభ్‌మన్‌గిల్ (Shubman Gill)..శనివారం నుంచి గువాహటిలో మొదలుకాబోయే రెండో టెస్టులో ఆడతాడా? లేదా? అన్నదానిపై సందిగ్ధత కొనసాగుతున్నది. అతడు కోల్‌కతాలోనే విశ్రాంతి తీసుకుంటాడని ముందుగా వార్తలొచ్చినా బుధవారం గిల్ జట్టుతో కలిసి గువాహటికి వెళ్లాడు. శనివారం నాటికి అతడు వంద శాతం మ్యాచ్ ఫిట్నెస్ సాధించడం కష్టమేనని తెలుస్తున్నది. ప్రస్తుతం మెడ నొప్పి కాస్త తగ్గినా గిల్ ఇప్పటికీ బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. తొలి టెస్టు ఓటమి నేపథ్యంలో గువాహటిలో ఆడాలని అతడు భావిస్తున్నా వైద్యులు మాత్రం అతడికి కనీసం పదిరోజులు విశ్రాంతి అవసరమని చెప్పడంతో కెప్టెన్ ప్రాతినిధ్యంపై ఆసక్తి నెలకొంది. నొప్పి తగ్గి అతడిని రెండో టెస్టులో ఆడించినా ఒకవేళ అది పునరావృతమైతే అప్పుడు మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు.
వన్డే సిరీస్ ముగిసే దాకా రెస్ట్ ఇస్తే..?
గిల్‌కు విరామం ఇవ్వాలనుకుంటే రెండో టెస్టుతో పాటు ఈనెల 30 నుంచి మొదలయ్యే వన్డే సిరీస్‌లోనూ అతడు ఆడేది అనుమానమే అవుతుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిశాక ఆరంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నాటికి పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తే అతడు తిరిగి జట్టుతో చేరతాడన్న వాదనలూ వినిపిస్తున్నాయి. వన్డేల్లోనూ సారథిగా ఉన్న గిల్.. సిరీస్‌కు దూరమైతే కెప్టెన్ ఎవరన్న డైలమా కూడా నెలకొంది. వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సైతం గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌లో ఎవరో ఒకరికి సారథ్య పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయి.
అతడి స్థానాన్ని భర్తీ చేసేదెవరు?
కెప్టెన్ స్థానాన్ని భర్తీ చేయడం పైనా జట్టు మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతున్నది. ఇప్పటికే జట్టుతో ఉన్న సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్‌తో పాటు నితీశ్ రెడ్డిలో ఎవరో ఒకర్ని ఆడిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కోల్‌కతాలో సఫారీ స్పిన్నర్ సైమన్ హర్మర్ను ఎదుర్కునేందుకు గాను భారత జట్టులో ఎడమ చేతి వాటం బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జైస్వాల్ నుంచి మొదలుకుని పంత్, జడేజా, అక్షర్, వాషింగ్టన్.. ఇలా అందరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే. సుదర్శన్, పడిక్కల్ సైతం అదే కోవలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ రెడ్డికి అవకాశమిస్తే ఆల్‌రౌండర్ గానూ కలిసొస్తాడని మేనేజ్మెంట్ భావిస్తున్నది. మరి జట్టు నిర్ణయం ఎలా ఉండనుందనేది ఆసక్తికరం!