సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) ఐపీఎల్ పోరుకు సర్వశక్తులతో సిద్ధమవుతున్నది. 2013లో అరంగేట్రం నుంచి ఇప్పటి దాకా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ లీగ్‌లోకి వచ్చి రావడంతోనే తనదైన మార్క్ చూపెట్టింది. అప్పటి వరకు బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగుతున్న లీగ్‌లో బౌలర్ల దమ్ము ఏంటో చేతల్లో చూపించింది. మొదటి సీజన్లో ప్లేఆఫ్స్‌లో నిలిచిన హైదరాబాద్ మూడేండ్ల వ్యవధిలో చాంపియన్‌గా నిలిచి వారెవ్వా అనిపించింది. ఆ తర్వాత నాలుగేండ్లు అదే జోరు కనబరిచింది. కానీ 2021 నుంచి సన్‌రైజర్స్ సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ప్రతీ ఏడాది కెప్టెన్, కోచ్ మార్చిన రైజర్స్ లీగ్ దశలోనే తమ పోరాటాన్ని ముగిస్తూ వచ్చింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా కొత్త కెప్టెన్‌గా కమిన్స్, కోచ్‌గా వెటోరీతో లీగ్‌లో అడుగుపెడుతున్న రైజర్స్ ఈ సారైనా కప్ కలను సాకారం చేసుకునేందుకు పట్టుదలతో ఉంది.
– నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
SRH | ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ది ప్రత్యేక ప్రస్థానం. 2013లో లీగ్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ వచ్చి రావడంతోనే తమ మార్క్ చాటుకుంది. బ్యాటర్ల ఆధిపత్యానికి సూపర్ బౌలింగ్ దళంతో గండికొడుతూ స్వల్ప లక్ష్యాలను కాపాడుకున్న జట్టుగా నిలిచింది. డేవిడ్ వార్నర్ సారథ్యంలో 2016లో తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఎస్ఆర్హెచ్ మళ్లీ ఆ ఫీట్‌ను పునరావృతం చేయలేకపోయింది. గత వైభవానికి కొనసాగింపుగా ఈసారి మరింత దుర్భేద్యమైన బౌలింగ్ దళంతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించేలా ప్రణాళికలు రచిస్తున్నది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి కొత్తకొత్తగా కనిపిస్తున్నది. గత మూడేండ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని తిరిగి కొనసాగిస్తూ కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్, కొత్త కోచ్‌గా డానియల్ వెటోరీతో సీజన్‌తో ప్రారంభించబోతున్నది. గత మూడు సీజన్లలో హైదరాబాద్ ప్రతీసారి కొత్త నాయకునితో బరిలోకి దిగింది. ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచకప్‌తో పాటు డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్ అందించిన కమిన్స్ తొలిసారి ఐపీఎల్లో కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. వేలంలో కనివినీ ఎరుగని రీతిలో కమిన్స్‌ను రూ.20.50 కోట్లతో దక్కించుకున్న రైజర్స్ యాజమాన్యం..మెరుగైన ఫలితం ఆశిస్తున్నది.
బలం: లీగ్‌లో మిగతా జట్లతో పోలిస్తే..హైదరాబాద్‌కు బౌలింగ్ ప్రధానాస్త్రం. గత తొమ్మిదేండ్లుగా ఎంతటి స్వల్ప లక్ష్యాన్ని అయినా హైదరాబాద్ కాపాడుకున్న వైనం. కమిన్స్ చేరికతో రైజర్స్ బౌలింగ్ దళానికి మరింత బలం చేకూరింది. గత సీజన్లో భువనేశ్వర్‌కుమార్(16), మయాంక్ మార్కండే మెరుగ్గా రాణించారు. మరోవైపు అనుభవలేమితో సతమతమవుతున్న రైజర్స్ స్పిన్ విభాగానికి హసరంగ చేరిక బలం చేకూర్చనుంది. సుందర్, షాబాజ్ అహ్మద్, సుబ్రమణ్యన్తో కలిసి హసరంగ బౌలింగ్‌ను పంచుకోనున్నాడు. ఈసారి విదేశీ ప్లేయర్ల రాక హైదరాబాద్‌ను పటిష్ఠంగా మార్చింది. ముఖ్యంగా కమిన్స్, హెడ్, హసరంగ జట్టులో చేరడం గెలుపు అవకాశాలను మెరుగుపర్చనుంది.
బలహీనత: హైదరాబాద్‌కు భారత స్టార్ బ్యాటర్ల కొరత స్పష్టంగా కనిపిస్తున్నది. మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్‌శర్మ, అబ్దుల్ సమద్ ఉన్నా..ఇటీవలి ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే టోర్నీల్లో వీరి ప్రదర్శన అంత బాగా ఏం లేదు. దీనికి తోడు గత సీజన్లో భారత బ్యాటర్లు ఏ ఒక్కరూ కూడా 300 పరుగుల మార్క్ అందుకోలేకపోయారు.
కెప్టెన్‌గా కమిన్స్ జట్టులో సమిష్టితత్వాన్ని నింపే అవకాశముంది. ఇన్ని రోజులుగా ఎవరికి వారుగా అన్నట్లు రాణించిన హైదరాబాద్‌ను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు కమిన్స్ అనుభవం ఉపయోగపడునంది. గత రెండేండ్ల నుంచి జాతీయ జట్టుకు దూరమైన భువనేశ్వర్ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఈ ఐపీఎల్ మంచి అవకాశం. ఇటీవలి దేశవాళీ టోర్నీల్లో అదరగొట్టిన భువీ..టీ20 ప్రపంచకప్‌లో చోటే లక్ష్యంగా రాణించే చాన్స్ ఉంది.
మరికొన్ని గంటల్లో ఐపీఎల్‌కు తెరలేవబోతున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త పాటతో అభిమానుల్లో మస్తు జోష్ తీసుకొచ్చింది. ‘సన్‌రైజర్స్ మేము బ్రో..పక్కా ఇంకో రేంజ్ బ్రో’ అంటూ సాగే ఈ మాస్ బీట్ ఆరెంజ్ ఆర్మీ అభిమానులను హుషారెత్తిస్తున్నది. ఈ పాటను ఎస్ఆర్హెచ్ తమ అధికారిక ట్విటర్(ఎక్స్) ద్వారా బుధవారం విడుదల చేసింది. పక్కా మాస్ సాంగ్‌తో రూపుదిద్దుకున్న ఈ వీడియోలో కెప్టెన్ కమిన్స్, భువనేశ్వర్, మార్క్మ్,్ర హెడ్, సుందర్, అభిషేక్, ఉమ్రాన్ మాలిక్ అలరించారు. పాటకు తగ్గట్లు హైదరాబాద్‌లోని చారిత్రక ప్రదేశాలైన చార్మినార్, మొజంజాహీ మార్కెట్, దుర్గం చెరువును ఇందులో చూపించారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హెడ్, అభిషేక్, త్రిపాఠి, అగర్వాల్, క్లాసెన్, సుందర్, అహ్మద్, కమిన్స్(కెప్టెన్), హసరంగ, భువనేశ్వర్, నటరాజన్, సమద్(ఇంప్యాక్ట్ సబ్)