హూస్టన్: ప్రస్తుత ఫిఫా వరల్డ్‌కప్(FIFA World Cup)లో.. ఆఫ్రికా ద్వీప దేశం కేప్ వెర్డే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన ఆ దేశం.. ప్రత్యర్థులకు షాక్ ఇస్తూ నాకౌట్ దశకు చేరుకున్నది. అయితే ఆ జట్టు కెప్టెన్ ర్యాన్ మెండిస్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఓ బ్రెజిల్ మహిళపై అతను అత్యాచారానికి పాల్పడినట్లు కేసు బుక్కైంది. ఆ కేసును న్యూజిలాండ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఫిఫా వరల్డ్‌కప్ కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో.. ఆక్లాండ్‌లో కేప్ వెర్డే ఓ మ్యాచ్ ఆడింది. ఆ సమయంలో బ్రెజిల్ మహిళతో పరిచయం అయ్యింది.
వాస్తవానికి ఆమెను కేప్ వెర్డే జట్టుకు ఇంటర్‌ప్రిటర్‌గా కివీస్ ప్రభుత్వం నియమించింది. చిలీ దేశంతో మ్యాచ్ జరిగిన తర్వాత తన హోటల్ రూమ్‌కు వెళ్లాలని, ఆ టైంలో కేప్ వెర్డే కెప్టెన్ ర్యాన్ మెండిస్ అనుమతి లేకుండానే రూమ్‌లోకి ఎంటర్ అయ్యాడని, భౌతికంగా దాడి చేసి, అత్యాచారం చేసినట్లు ఆ మహిళ ఆరోపించింది. వాంగ్మూలంతో పాటు గాయాలకు చెందిన ఫోటోలను ఆమె కివీస్ పోలీసులకు సమర్పించింది. ఆ ఘటన తర్వాత ఫోరెన్సిక్ పరీక్షలు జరిగాయి. ఆమెకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.
ఏప్రిల్‌లో నమోదు అయిన ఆ ఫిర్యాదుపై ఇంకా విచారణ జరుగుతున్నట్లు కివీస్ పోలీసులు వెల్లడించారు. ఆక్లాండ్ హోటల్లో ఉన్న సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలించామని, కానీ అనుమానితుడిని ఎవర్నీ గుర్తుపట్టలేదన్నారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని, దీని వల్ల కెప్టెన్ మెండిస్‌ను నిర్దోషిగానే భావిస్తున్నామని, కానీ కోర్టులో ఈ కేసు విచారణకు రానున్నట్లు కివీస్ పోలీసులు చెప్పారు.
ఆటగాళ్ల ప్రవర్తనపై ఎప్పటికీ తమ దృష్టి ఉంటుందని ఫిపా పేర్కొన్నది. కెప్టెన్ మెండిస్ అంశంలో కివీస్ అధికారులతో టచ్‌లో ఉన్నట్లు ఫిఫా వర్గాలు వెల్లడించాయి. ఇక నాకౌట్ మ్యాచ్‌లో అర్జెంటీనాతో కేప్ వెర్డే తలపడనున్న విషయం తెలిసిందే.