ఒంటరియొ (కెనడా): వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు గాను కెనడా అర్హత సాధించింది. అమెరికా క్వాలిఫయర్స్‌లో భాగంగా ఆ జట్టు.. ఆఖరి మ్యాచ్‌లో బహ్మాస్ను ఓడించడమే గాక వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలవడంతో వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని దక్కించుకుంది.
కెనడా.. అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా ముగిసిన గత ఎడిషన్‌లోనూ ఆడింది. ఇక 20 దేశాలు పాల్గొనబోయే 2026 ఎడిషన్‌లో ఇప్పటికే భారత్, శ్రీలంకతో పాటు ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ అర్హత సాధించగా తాజాగా ఆ జాబితాలో కెనడా చేరింది. మిగిలిన ఏడు జట్లలో రెండింటిని యూరప్ క్వాలిఫయర్ ద్వారా ఎంపిక చేయనుండగా మరో రెండు జట్లను ఆఫ్రికా క్వాలిఫయర్‌లో, మూడింటిని ఆసియా-ఈఏపీ క్వాలిఫయర్స్‌తో భర్తీ చేయనున్నారు.