హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకు అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. క్రికెట్ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా సీజన్‌ను సాఫీగా నిర్వహించేందుకు కౌన్సిల్ తాజాగా సమావేశమైంది. ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం విషయంలో అధ్యక్షుడు జగన్మోహన్రావు, కోశాధికారి సీజే శ్రీనివాసరావు అరెస్ట్ కావడం, కార్యదర్శి దేవరాజ్ పరారీలో ఉండటంతో హెచ్‌సీఏ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి.
ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ రాజ్యాంగంలోని 15(7)ను అనుసరించి అత్యవసర నిర్ణయాలు తీసుకునేందుకు ఉపాధ్యక్షుడు సర్దార్ దల్జీత్‌సింగ్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు సంయుక్త కార్యదర్శి బసవరాజు, కౌన్సిలర్ సునీల్‌కుమార్ అగర్వాల్, సీఏజీ నామినీ రాజశేఖర్ సభ్యులుగా హెచ్‌సీఏను ముందుకు నడిపించనున్నారు. ఫంక్షనల్ అపెక్స్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి. ప్లేయర్స్ ఫిర్యాదు చేసేందుకు మూడంచల మెకానిజమ్‌ను హెచ్‌సీఏ తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్లేయర్లు ఫిజికల్ బాక్స్, టోల్‌ఫ్రీ లైన్, ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ సమస్యలను హెచ్‌సీఏ దృష్టికి తీసుకువచ్చే అవకాశం కల్పించారు.
ప్రతిభకు పెద్దపీట వేస్తూ హెచ్‌సీఏ అకాడమీని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ పూర్తి స్థాయి డైరెక్టర్, కోచింగ్ బృందాన్ని నియమించే ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. హెచ్‌సీఏలో జరుగుతున్న కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు బీసీసీఐకి తెలియజేయాలని నిర్ణయించారు. హెచ్‌సీఏ పరిధిలోని అన్ని మైదానాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని సభ్యులు తీర్మానం చేశారు. ఖాళీ అయిన సీఈవో పోస్ట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 25 ఆఖరి తేదీగా ప్రకటించారు.