గువాహటి : బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్లు తన్విశర్మ, ఉన్నతి హుడా, రక్షిత శ్రీరామ్రాజ్ పతక పోరులో నిలిచారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో తన్విశర్మ 15-12, 15-7తో ఒయి వినార్టో(ఇండోనేషియా)పై అలవోక విజయం సాధించింది. ఆది నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన తన్వి.. వరుస గేముల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది.
మరో సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ ఉన్నతి 15-8, 15-5తో అలైస్ వాంగ్(అమెరికా)పై గెలిచి ముందంజ వేసింది. వాంగ్‌కు ఏమాత్రం అవకాశమివ్వని ఉన్నతి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. మరో సింగిల్స్‌లో 10వ సీడ్ రక్షిత 11-15, 15-5, 15-8తో అలియాహ్ జకారియా(సింగపూర్)పై విజయం సాధించింది. బాలుర సింగిల్స్‌లో జ్ఞానదత్తు 11-15, 15-6, 15-11తో సూర్యక్ష్ రావత్‌పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.