న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ సంచలనం ఆయుష్ శెట్టి ప్రిక్వార్టర్స్ చేరగా.. టైటిల్ ఫేవరెట్ లక్ష్య సేన్ రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 9వ సీడ్ సింధు 21-16, 21-17తో కెనడాకు చెందిన వెన్ యు జాంగ్‌పై వరుస గేమ్స్‌లో విజయం సాధించింది. ప్రిక్వార్టర్స్‌లో తను చైనా స్టార్, మూడో సీడ్ వాంగ్ జి యితో అమీతుమీ తేల్చుకోనుంది. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడుతున్న యువ షట్లర్ ఉన్నతి హుడా 21-11, 9-21, 21-23తో 12వ సీడ్ మిచెల్ లీ (కెనడా) చేతిలో పోరాడి ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో లక్ష్యకు అమెరికా షట్లర్ గారెట్ టాన్ షాకిచ్చాడు.
67 నిమిషాల పాటు సాగిన పోరులో లక్ష్య 21-19, 19-21, 17-21తో ఓటమి పాలయ్యాడు. ఇక పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో గాయం కారణంగా ప్రత్యర్థులు వాకోవర్ ఇవ్వడంతో భారత స్టార్ జోడీ సాత్విక్- చిరాగ్ శెట్టి నేరుగా ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. మరోమ్యాచ్‌లో హరిహరన్-ఎంఆర్ అర్జున్ 17-21, 14-21తో కాంగ్ మిన్ హ్యుక్ – కీ డాంగ్ జూ (కొరియా) చేతిలో ఓడగా.. మిక్స్డ్ లో తనీషా క్రాస్టో – ధ్రువ్ కపిల 21-11, 21-11తో లియాంగ్ చోంగ్-వెంగ్ చీ (మకావు)పై నెగ్గి ప్రిక్వార్టర్స్ చేరింది.