Buvaneshwar Kumar : భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Buvaneshwar Kumar) బ్లూ జెర్సీలో కనిపించి చాలా రోజులైంది. రెండేండ్లుగా టీమిండియాకు ఆడని భువీ ఐపీఎల్ ప్రదర్శనతో అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా ఈ స్పీడ్‌స్టర్ తన భార్య నుపుర్ నగర్(Nupur Nagar) పుట్టిన రోజును చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేశాడు.
ఆమెపై అంతులేని ప్రేమను భువనేశ్వర్ ఆశ్చర్యపరిచే రీతిలో చూపించాడు. దాంతో, బర్డ్ డే నాడు సర్ప్రైజ్ సెలబ్రేషన్‌తో నుపుర్ తెగ మురిసిపోయిందనుకోండి. అనంతరం స్నేహితుల సమక్షంలో నుపుర్ కేకు కట్ చేసింది. ఈ ఫొటో, వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫొటోలో వాళ్ల కూతురు అక్సాష్ కూడా ఉంది.
నిఖార్సైన స్వింగ్ బౌలర్ కొరత తీర్చిన భువనేశ్వర్ భారత క్రికెట్లో ఓ వెలుగు వెలిగాడు. 2012లో అరంగేట్రం చేసిన భువీ సంచలన ప్రదర్శనలతో ఔరా అనిపించాడు. ఐపీఎల్‌నూ ఈ స్వింగ్ సుల్తాన్ అబ్బురపరిచే గణాంకాలు నమోదు చేశాడు. ఇప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)ప్రధాన బౌలర్‌గా భువీ కొనసాగుతున్నాడు.
టీమిండియా తరఫున కెరీర్ అద్భుతంగా సాగుతున్నదశలో గాయాలు, ఫిట్నెస్ సమస్యలు భువీ కెరీర్‌ను ప్రశ్నార్థకం చేశాయి. దాంతో, 2022 నవంబర్ తర్వాత జాతీయ జట్టులో కనిపించలేదు. నిరుడు ఆగస్టులో మొదలయ్యే ఐర్లాండ్ సిరీస్ (Ireland Series) జట్టులో చోటు ఆశించిన అతడకి సెలెక్టర్లు షాకిచ్చారు. దాంతో, అతడు టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2012లో జాతీయ జట్టులో అడుగుపెట్టిన భువనేశ్వర్ కుమార్ 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో మొత్తంగా 294 వికెట్లు తీశాడు.