FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ పండుగకు రెండేండ్లు కూడా లేదు. అప్పుడే మెగా టోర్నీపై అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే క్వాలిఫికేషన్ రౌండ్స్ పూర్తి కావొచ్చాయి. ఈ నేపథ్యంలో ఫైనల్లో ఆడేది ఎవరు? అనే చర్చకు తెరలేచింది. ఇంకేముంది బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు హెడ్‌కోచ్ డొరివల్ జునియర్(Dorival Junior) ‘ఈసారి మేము ఫైనల్ ఆడడం పక్కా’ అని జోస్యం పలికాడు.
అంతేకాదండోయ్.. తాను చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అనడంలో తనకు ఇసుమంత కూడా సందేహం లేదని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. వరల్డ్ కప్ సన్నద్ధత గురించి మంగళవారం మీడియా సమావేశంలో డొరివల్ మాట్లాడాడు. ‘ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో బ్రెజిల్ ఆడునుంది. మేము కచ్చితంగా టైటిల్ పోరులో తలపడుతాం. నేను ఈ మాటలు చెబుతున్నప్పుడు మీరు వీడియో తీయొచ్చు.
బ్రెజిల్ ఫైనల్ ఆడతుంది అని అనడంలో నాకు ఎలాంటి అనుమానం లేదు. మేము కచ్చితంగా ఫైనల్ ఆడుతాం’ అని డొరివల్ ఎంతో ఆత్మవిశ్వాసంగా అన్నాడు. అంతేకాదు 2026 ఎడిషన్‌లో నెయ్మర్ జూనియర్(Neymar Junior) బ్రెజిల్ విజయంలో కీలకం అవుతాడని డొరివల్ తెలిపాడు. రెండేండ్ల క్రితం ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో బ్రెజిల్ సెమీ ఫైనల్లోనే వెనుదిరిగింది. ఉత్కంఠ పోరులో నెయ్మర్ సారథ్యంలోని బ్రెజిల్‌ను క్రొయేషియా 4-2తో ఇంటికి పంపింది.
ఇక ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో ఈ దక్షిణ అమెరికా జట్టుకు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటికే ఐదుసార్లు బ్రెజిల్ వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. మరో రెండు పర్యాయాలు ఫైనల్ చేరింది కానీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దాంతో, ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని ఆ జట్టుతో సహా, కోచ్, సహాయక సిబ్బంది పట్టుదలతో ఉన్నారు.