KTR | అండర్-19 మహిళల ప్రపంచకప్లో సెంచరీ చేసిన తొలి మహిళగా తెలంగాణ అమ్మాయి త్రిష గొంగిడి రికార్డు సృష్టించడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అండర్ 19 మహిళల ప్రపంచకప్లో అద్భుతమైన ఫీట్ సాధించిందని కొనియాడారు. దేశ గౌరవాన్ని పెంచడంతో పాటు.. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో మార్మోగేలా చేశావని ప్రశంసించారు.
ఐసీసీ అండర్ 19 టీ 20 మహిళల ప్రపంచకప్ లో సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్ఉమెన్ గా రికార్డ్ సాధించి.. ఎంతోమంది మహిళలకు, మహిళా క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచిందని త్రిష గొంగిడిని కేటీఆర్ కొనియాడారు. ఆమెకు మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. మరికొన్నాళ్లలోనే టీమిండియా మహిళా క్రికెట్లో అడుగుపెడతావని.. కెప్టెన్గా చూస్తామని ఆశిస్తున్నానని అన్నారు.
గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష.. మలేషియాలో జరుగుతున్న అండర్-19 మహిళల ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన సూపర్ సిక్స్ పోరులో త్రిష (59 బంతుల్లో 110 నాటౌట్, 13 ఫోర్లు, 4 సిక్సర్లు) 53 బంతుల్లోనే శతకం బాది ఈ టోర్నీలో మొట్టమొదటి సెంచరీ చేసిన క్రికెటర్గా తన పేరును రికార్డుల పుస్తకాలలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.