Australian Open : ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open 2024)లో మరో సంచలనం నమోదైంది. వింబుల్డన్ విజేత మర్కెట ఒండ్రుసోవా(Marketa Vondrusova) తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టిన కాసేపటికే.. బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే(Andy Murray) కూడా వెనుదిరిగాడు. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ముర్రే 13 ఏండ్లలో రెండో రౌండ్‌కు చేరకపోవడం ఇది రెండోసారి.
ఐదుసార్లు ఫైనలిస్ట్ అయిన ముర్రేను అర్జెంటీనాకు చెందిన థామస్ మార్టిన్ ఎట్జెవెర్రీ(Tomás Martín Etcheverry) అవలీలగా ఓడించాడు. రెండు గంటల 23 నిమిషాల పాటు జరిగిన పోరులో 32వ ర్యాంకర్ థామస్ ధాటికి ముర్రే నిలవలేకపోయాడు. తొలి సెట్ నుంచి వెనకబడిన బ్రిటన్ స్టార్ 4-6, 2-6, 2-6తో మ్యాచ్ చేజార్చుకున్నాడు. దాంతో, కెరీర్ చివర్లో గ్రాండ్‌స్లామ్ గెలవాలనుకున్న ముర్రే కల చెదిరింది.
Moving 🔛
Tomas Etcheverry flies into the second round, defeating Andy Murray 6-4 6-2 6-2 💪#AusOpen • #AO2024 pic.twitter.com/dfYQGmkQvI
— #AusOpen (@AustralianOpen) January 15, 2024
ఇదొక అద్భుతమైన మ్యాచ్. ముర్రే లాంటి లెజెండరీ ఆటగాడితో తలపడడం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. అతడు నా ఆరాధ్య ఆటగాడు. నిరుడు మేము రెండు సార్లు తలపడ్డాం. ఇప్పటిలెక్కనే అప్పుడు కూడా సుదీర్ఘ సమయం ఆడాం. ఈరోజు నేను గొప్ప ప్రదర్శన చేశా. తర్వాతి మ్యాచ్‌లోనూ ఇదే జోరు కనబరుస్తానని ఆశిస్తున్నా అని మ్యాచ్ అనంతరం థామస్ తెలిపాడు.
బ్రిటన్‌లో టెన్నిస్‌కు క్రేజ్ తీసుకొచ్చిన ముర్రే ఇప్పటివరకూ మూడు గ్రాండ్‌స్లామ్స్ టైటిళ్లు సాధించాడు. 2005లో అరంగేట్రం చేసిన ముర్రే ఖాతాలో 46 సింగిల్స్ టైటిళ్లు, 14 మాస్టర్స్ 1000 టైటిళ్లు ఉన్నాయి. అంతేకాదు ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో రెండు బంగారు పతకాలు కూడా గెలిచాడు. అయితే.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడనే వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో, తాను ఇంకా టెన్నిస్‌ను ప్రేమిస్తున్నాని, ఇప్పట్లో ఆటకు వీడ్కోలు పలికేది లేదని ముర్రే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.